ముంబై: తెలంగాణ రాష్ట్రాన్ని నెట్ జీరో స్టేట్ గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి .అందులో భాగంగానే క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ది నమూనాను తీసుకొచ్చామన్నారు. పట్టణాభివృద్దిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు సీఎం.
తెలంగాణలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా పంప్ సెట్లు, 50లక్షల ఇండ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. బొగ్గు, సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్, గ్రీన్ ఎనర్జీ వైపు మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్, స్థిర శక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామని సీఎం చెప్పారు.
2034 నాటికి హైదరాబాద్‌ను నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పట్టణాభివృద్ధిలో భాగంగా కార్బన్ ఫుట్‌ప్రింట్ ఆడిట్ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్ నిలవబోతుందని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో కోర్ అర్బన్ రీజియన్(క్యూర్)లో ఏ ఒక్క పరిశ్రమ ఉండదని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో క్లైమేట్ వీక్ సదస్సులో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి..పట్టణాలు, నగరాభివృద్ది, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలపై తెలంగాణ విజన్ ను వివరించారు. ప్రస్తుతం అభివృద్ధి వ్యూహంలో తయారీ రంగం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత్వం కీలకంగా మారాయని అన్నారు సీఎం. ఏ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్ ఉత్పాదక వనరులే అసలైన కరెన్సీ అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, వినియోగం అభివృద్ధికి కొలమానంగా నిలుస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర జీడీపీని 200 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.రాష్ట్ర వ్యూహాత్మక అభివృద్ధికి తెలంగాణను CURE, PURE, RARE జోన్‌లుగా విభజించామని సీఎం తెలిపారు.
