మెదక్ కలెక్టర్ రాహుల్‌‌‌‌ రాజ్‌‌కు ఆరు నెలలు జైలుశిక్ష

మెదక్ కలెక్టర్ రాహుల్‌‌‌‌ రాజ్‌‌కు ఆరు నెలలు జైలుశిక్ష
  • కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌లో హైకోర్టు తీర్పు

హైదరాబాద్, వెలుగు: ఆస్తి హక్కులకు సంబంధించి ఇరుపక్షాలకు నోటీసులు ఇచ్చి.. వాదనలు విని వివాదాన్ని చట్టప్రకారం పరిష్కరించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన మెదక్‌‌ కలెక్టర్‌‌ రాహుల్‌‌రాజ్‌‌కు 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. మెదక్‌‌ జిల్లా చేగుంట మండలం బోనాల్‌‌ గ్రామంలో సర్వే నం.284/ఎ/2లో 2.22 ఎకరాల హక్కులకు సంబంధించి ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి.. ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ నల్లవెల్లి లక్ష్మి కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించారు. పిటిషనర్‌‌ తాత భూమిని మ్యుటేషన్‌‌ చేసి పట్టాదారు పాస్‌‌బుక్‌‌ ఇవ్వాలని పిటిషనర్‌‌ పెట్టుకున్న దరఖాస్తుపై స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా చట్టప్రకారం ఉత్తర్వులు వెలువరించాలని 2022లో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఉత్తర్వుల నేపథ్యంలో పిటిషనర్‌‌ తాత ఊషయ్య భూమిని గంగయ్య, నారాయణ, మల్లయ్యకు సాదా బైనామా ద్వారా విక్రయించారని.. తహసీల్దార్, మండల గిర్‌‌దావర్‌‌ నివేదికను పరిశీలించి ఆమె దరఖాస్తును తిరస్కరిస్తూ కలెక్టర్‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌‌ ఉత్తర్వులపై పిటిషనర్‌‌ మళ్లీ కోర్టును ఆశ్రయించగా వాటిని రద్దు చేసి ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి, సాదాబైనామా, రెగ్యులరైజింగ్‌‌ ప్రొసీడింగ్స్‌‌ను భూమిని కొనుగోలు చేసినవారి నుంచి తెప్పించి పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. 

పిటిషనర్‌‌ లక్ష్మి, ప్రతివాదులు గంగయ్య, మల్లయ్య, నారాయణకు నోటీసులు ఇవ్వాలని చెప్పినా నోటీసు ఇవ్వకుండా గత ఏడాది డిసెంరు 31న కలెక్టర్‌‌  ఉత్తర్వులు వెలువరిస్తూ పిటిషనర్‌‌ లక్ష్మి అభ్యర్థనను తిరస్కరించడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ దాఖలు చేశారు.

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ నోటీసులు ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కోర్టు ధిక్కరణకు పాల్పడిన కలెక్టర్‌‌ రాహుల్‌‌రాజ్‌‌కు 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అయితే, అప్పీలు చేసుకోవడానికి కోర్టు తీర్పు అమలును 4 వారాల పాటు నిలిపివేశారు.