ఈ తల్లి కష్టం.. ఏ తల్లీకి వద్దు.. ఈ తల్లి ఆవేదన మరో తల్లికి రాకూడదు.. దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన 23 ఏళ్ల సాహిల్ తల్లి మాటలు.. అందర్నీ కదిలిస్తున్నాయి.. అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. 23 ఏళ్లుగా నా కొడుకును ఒంటరిగా పెంచాను.. నేను ఒంటరి మహిళను.. నా జీవితమే నా కొడుకుపై పెట్టుకున్నాడు.. 23 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్నాను.. నా కొడుకును అన్యాయంగా పొట్టనపెట్టుకుని.. క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ ఆ తల్లి ప్రశ్నలకు ఏ ఒక్కరి దగ్గర సమాధానం లేదు.
ఫిబ్రవరి 3వ తేదీన ఢిల్లీ ద్వారకలో లైసెన్స్ లేకుండానే.. ఓ 10వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల కుర్రోడు SUV కారు డ్రైవింగ్ చేస్తూ.. అత్యంత వేగంగా వెళుతూ.. డ్రైవింగ్ చేస్తూ రీల్స్ తీస్తూ.. బైక్ పై వెళుతున్న సాహిల్ ను ఢీకొట్టాడు. స్పాట్ లోనే 23 ఏళ్ల సాహిల్ చనిపోయాడు. ఈ యాక్సిడెంట్ లో చనిపోయిన సాహిల్ తల్లి ఇప్పుడు ఒంటరిగా.. న్యాయం.. ధర్మం కోసం దీనంగా వేడుకుంటుంది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటీ అంటే.. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కు కూడా అర్హత లేని 15 ఏళ్ల కుర్రోడు SUV కారుతో.. నిర్లక్ష్యంగా ఓ నిండి ప్రాణం తీస్తే.. అతన్ని సపోర్ట్ చేస్తూ లాయర్లు వాదించటమే కాకుండా.. ఇది ఓ నిర్లక్ష్యంగా.. అనుకోకుండా.. విద్యా ఒత్తిడిలో జరిగిన ప్రమాదంగా చిత్రీకరించటాన్ని జీర్ణించుకోలేకుండా చేస్తుంది సాహిల్ తల్లికి.
సాహిల్ తల్లికి.. నిందితుడి తండ్రి క్షమాపణలు చెప్పటాన్ని కూడా తప్పుబట్టింది. ఆ క్షమాపణలు ఎందుకు తీసుకోవాలి.. ఎవరి కోసం.. నా ప్రపంచాన్ని విచారంలోకి నెట్టినందుకా.. నాకు పగలు, రాత్రి అని తేడా లేకుండా చేసినందుకా.. నా సర్వస్వాన్ని.. నా జీవితాన్ని నాశనం చేసినందుకా.. ఒక్కగానొక్క కొడుకు.. 23 ఏళ్లు ఒంటరిగా.. ఎన్నో బాధలు పడుతూ.. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును.. మీ కొడుకు నిర్లక్ష్యంతో నాశనం చేశారు కదా.. ఇంత చేసి క్షమాపణలు ఎలా చెప్పగలుతున్నారు అంటూ నిందితుడు అయిన పిల్లోడి తండ్రి క్షమాపణలను తిరస్కరించింది సాహిల్ తల్లి.
సాహిల్ తల్లి ప్రశ్నిస్తున్న ఒక్కో మాట.. ఒక్కో తూటాలా అందర్నీ కదిలిస్తుంది. 10వ తరగతి చదువుతున్న పిల్లోడికి.. అంత పెద్ద కారు ఎలా ఇచ్చారంటూ ఆ కుటుంబాన్ని నిలదీస్తున్నారు నెటిజన్లు. ఆ పేరంట్స్ పై కేసు పెట్టరా.. చదువు ఒత్తిడి అంటున్నారు.. అందరికీ ఉంటుంది కదా.. ప్రత్యేకంగా మీ పిల్లోడికి మాత్రమే చదువు ఒత్తిడి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కేవలం తల్లి, కొడుకు మాత్రమే ఉన్న ఆ కుటుంబంలోని.. కొడుకును అన్యాయంగా చంపేసి.. నిందితుడి తరపునే సానుభూతి వ్యక్తం అయ్యే విధంగా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అనే ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లను కదిలించేస్తున్నాయి.
