గాంధీ నగర్: పసికూన నెదర్లాండ్స్‌పై టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే విరుచుకుపడ్డాడు. బుధవారం (ఫిబ్రవరి 18) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన చివరి గ్రూప్ మ్యాచులో సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది.
దూబే (66) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్య (34), తిలక్ వర్మ (31), హార్ధిక్ పాండ్య (30) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ రెండు వికెట్లు పడగొట్టగా.. కైల్ క్లైన్, లోగాన్ వాన్ బీక్ చెరో వికెట్ సాధించారు. అనంతరం నెదర్లాండ్స్ 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది.
అభి హ్యాట్రిక్ డకౌట్.. దూబే సిక్సర్ల వర్షం:
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. వరుసగా మూడో మ్యాచులోనూ డకౌటై తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి ఓవర్లలోనే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు.
పాకిస్తాన్‌పై వీరోచిత ఇన్సింగ్స్ ఆడిన మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా (18) త్వరగానే ఔట్ అయ్యాడు. ఆర్యన్ దత్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయే క్రమంలో దురదృష్టవశాత్తూ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (34), తిలక్ వర్మ (31) ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.
తిలక్ ఔటైన తర్వాత క్రీజులో వచ్చిన దూబే మొదట్లో ఆచితూచి ఆడాడు. చివర్లో గేర్ మార్చి నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. చివర్లో హార్ధిక్ పాండ్యా కూడా సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు.
