కొలంబో: టీ20 వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న శ్రీలంకకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మతీష పతిరన మెగా టోర్నీలో మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు. 2026, ఫిబ్రవరి 16న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో పతిరన గాయపడ్డ సంగతి తెలిసిందే.
బౌలింగ్ చేస్తుండగా తొడ కండరాలు పట్టేడయంతో ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోలుకోవడానికి నాలుగు, ఐదు వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలపడంతో పతిరణ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది.
పతిరన గాయంపై శ్రీలంక బ్యాటింగ్ కన్సల్టెంట్ విక్రమ్ రాథోర్ స్పందించారు. గాయం కారణంగా పతిరన మిగిలిన టోర్నీకి దూరమయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. దీనిపై జట్టు మేనేజ్మెంట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తుందన్నారు. పతిరన స్థానంలో ఎవరిని తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
పతరన స్థానంలో లెఫ్టార్మ్ పేసర్లు దిల్షాన్ మధుశంక, బినుర ఫెర్నాండో పేర్లను శ్రీలంక బోర్డు పరిశీలిస్తోన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరిని వరల్డ్ కప్ స్వ్కాడ్‌లో తీసుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు స్నిన్ ఆల్ రౌండర్ ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజులలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
