మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. డెబ్బై ఏళ్లు దాటినా.. నేటికీ కుర్రహీరోలతో పోటీపడుతూ వైవిధ్యమైన పాత్రలతో దూసుకెళ్తున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్నారు. అయితే గత ఏడాది ఆయన ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. లేటెస్ట్ గా ఒక ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొన్న మమ్ముట్టి .. 2025లో తాను అనుభవించిన ఆరోగ్య సమస్యలను, వేదనను, తిరిగి కోలుకున్న వైనాన్ని పంచుకున్నారు.
పోగొట్టుకున్నాకే తెలిసింది ఆ విలువేంటో!
సాధారణంగా మనం రుచి , వాసన, చూపు, వినికిడి వంటి వాటిని చాలా సహజమైనవిగా భావిస్తాం.. కానీ అవి లేనప్పుడు జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో మమ్ముట్టి తన మాటల్లో వివరించారు. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు వాసన చూడలేకపోవడం, ఆహారం తింటునప్పుడు రుచి తెలియపోవడం ఎంతటి నరకమో స్వయంగా తాను అనుభవించానని చెప్పారు. కొన్ని నెలల పాటు ఈ రెండు జ్ఞానేంద్రియాలను కోల్పోయాను . అవి మన దగ్గర ఉన్నంత కాలం వాటి విలువ మనకు తెలియదు. కోల్పోయినప్పుడే ఆ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది అని తన అనుభవాలను చెబుతూ మమ్ముట్టి భావోద్వేగానికి లోనయ్యారు.
వినికిడి శక్తి.. దేవిడిచ్చిన వరం
ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే వాల్యూమ్ తగ్గించమని మనం చెబుతాం.. ఎందుకంటే మనకు వినబడుతోంది కాబట్టి. కానీ వినబడని వారు ఆ మాట కూడా అనలేరు కదా అని మమ్ముట్టి అన్నారు. ఒక పాట బాగుందో లేదో చెప్పగలిగే స్థితిలో ఉన్నామంటే మనం అదృష్టవంతులం. ఎందుకంటే ఏదో ఒక శబ్దాన్ని వినాలనే తపనతో ఎందరో జీవిస్తున్నారు. వినికిడి అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అని మమ్ముట్టి చెప్పారు. వినికిడి లోపం ఉన్నవారి గురించి ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
భారీ ప్రాజెక్టులతో సెకండ్ ఇన్నింగ్స్
మహేష్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పేట్రియాట్' (Patriot) చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి నటిస్తున్న చిత్రమిది. ఇందులో ఫహాద్ ఫాజిల్, నయనతార వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 23న విడుదల కానుంది. దిగ్గజ దర్శకుడు అడూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో ఒక క్లాసిక్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న 'పాదయాత్ర' నటిస్తున్నారు. అంతే కాకుండా ధనుష్ హీరోగా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ 'D55' సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు.
