మంచి చేయాలని చూసిన కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతోంది.. ఇందుకు ఈ ఘటనే సాక్ష్యం. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి మంచి మనసుతో లిఫ్ట్ ఇస్తే 18 తులాల గోల్డ్ చైన్ దొబ్బేశాడు గుర్తు తెలియని వ్యక్తి. ఈ ఘటన తిరుపతి రూరల్ పరిధిలోని చెర్లోపల్లి –జూ పార్కు రోడ్డులో జరిగింది. వివరాల ప్రకారం.. పేరూరు గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి.
బుధవారం (ఫిబ్రవరి 18) చెర్లోపల్లి –జూ పార్కు రోడ్డులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. రఘునాథరెడ్డి మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చాడు. ఈ క్రమంలో టాయిలెట్ వెళ్లాలంటూ మార్గమధ్యంలో బైక్ ఆపామని కోరాడు నిందితుడు. బైక్ ఆపి కదిలే లోపే రఘునాథరెడ్డి మెడలో నుండి చైన్ లాక్కొని స్నాచర్ పరారయ్యాడు.
నిందితుడు రిక్షా కాలనీ వైపు పరిగెత్తగా రఘునాథరెడ్డి కొంత దూరం వెంబడించినప్పటికీ దొరకలేదు. దీంతో చేసేదేమి లేక రఘునాథరెడ్డి తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తిరుపతి రూరల్ ఎస్సై శ్రీరాములు తెలిపారు.
