అప్పుడు సింధూ.. ఇప్పుడు రావి.. పాక్‎ను మరో చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమైన భారత్..!

అప్పుడు సింధూ.. ఇప్పుడు రావి.. పాక్‎ను మరో చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమైన భారత్..!

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇండియా నిర్ణయంతో పాక్ తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కొంటుంది. తాగు, సాగు నీరు సరిగ్గా లేక అరిగోస పడుతోంది. ఈ తరుణంలో దాయాది దేశాన్ని మరో చావు దెబ్బకొట్టేందుకు ఇండియా సిద్ధమైంది. అప్పుడు సింధూ నది నీటిని ఆపేసిన ఇండియా.. ఇప్పుడు రావి నది జలాలను కూడా నిలిపేసేందుకు పావులు కదుపుతోంది. 

ఇందులో భాగంగానే భారత్ నుంచి పాక్‌లోకి ప్రవేశించే రావి నది జలాలను ఇండియా త్వరలో నిలిపివేసే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణం రావి నది మిగులు జలాల వాడకం కోసం తలపెట్టిన షాపూర్ కండి ప్రాజెక్ట్ పూర్తి కానుండటమే. 2026, మార్చి 31 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని జమ్మూ కశ్మీర్ జలవనరుల శాఖ మంత్రి జావేద్ అహ్మద్ వెల్లడించారు.

జావేద్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్, పంజాబ్ సరిహద్దుల్లో చేపట్టిన షాపూర్ కండి ప్రాజెక్టు 2026, మార్చి 31 నాటికి పూర్తవుతుందని ఆయన ధృవీకరించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే రావి నది మిగులు జలాలు పాక్‎కు వెళ్లకుండా ఆపొచ్చని తెలిపారు. ఆ నీటిని  కథువా, సాంబా వంటి కరువు పీడిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. 

షాపూర్ కంది డ్యామ్ ప్రాజెక్ట్:

1960లో కుదిరిన సింధూ నది జలాల ఒప్పందంలో భాగంగా రావి నది జలాలపై పూర్తి హక్కులు భారత్‎కే ఉన్నాయి. కానీ రావి నది పరివాహక ప్రాంతంలో సరైన ఆనకట్టలు లేకపోవడంతో ఇండియా వాడుకోగా మిగిలిన నీటిని పాకిస్తాన్‎కు వదులుతోంది. ఈ క్రమంలోనే రావి నది మిగులు జలాలను నియంత్రించడం కోసం 1979లో జమ్మూ కశ్మీర్, పంజాబ్ సరిహద్దులో భారత ప్రభుత్వం షాపూర్ కండి ఆనకట్ట ప్రాజెక్టును రూపొందించారు. 

1982లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ప్రాజెక్ట్‎కు  పునాది వేశారు. కానీ పంజాబ్, జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య పరిపాలనాపరమైన వివాదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ముందుకు సాగలేదు. దాదాపు 40 ఏళ్ల తరబడి ప్రాజెక్ట్ పెండింగ్‎లోనే ఉండిపోయింది. ఈ క్రమంలో 2018లో మోడీ సర్కార్ జమ్మూ, పంజాబ్ రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్ట్ పనుల్ని వేగవంతం చేసింది. ఎట్టకేలకు షాపూర్ కంది డ్యామ్ ప్రాజెక్ట్ పనులు చివరకు దశకు చేరుకున్నాయి. 

2026, మార్చి 31న నాటికి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుందని జమ్మూ కశ్మీర్ ఇరిగేషన్ మినిస్టర్ వెల్లడించారు. ఈ నీటిని కరువు పీడిత ప్రాంతాలైన సాంబా, కథువా జిల్లాలకు మళ్లించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 32 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందని అంచనా.  ఇప్పటికే సింధూ జలాల నిలిపివేతతో అరిగోస పడుతున్న పాక్.. ఇక రావి నది నీటిని కూడా నిలిపివేస్తే నీటి సంక్షోభంతో తల్లడిల్లిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.