హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇకపై సిటీ బస్సుల్లో లగేజ్ ర్యాక్స్ సౌకర్యం

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇకపై సిటీ బస్సుల్లో లగేజ్ ర్యాక్స్ సౌకర్యం

హైదరాబాద్ వాసులకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై అన్ని సిటీలో బస్సుల్లో  లగేజీ ర్యాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తొలుత 150 బస్సుల్లో ఈ సౌకర్యం కల్పించనున్నారు. వీలైనంత త్వరలోమిగతా బస్సుల్లో్నూ లగేజీ ర్యాక్స్ ఏర్పాటు చేస్తామని టీజీఎస్  ఆర్టీసీ ప్రకటించింది.  

సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులు బస్సెక్కగానే తమ లగేజీని పెట్టుకునేందుకు  సీట్ల పైభాగంలో ర్యాక్స్ ఏర్పాటు ఉంటుంది.  అయితే గ్రేటర్ పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లోఆ సౌకర్యం లేకపోవడంతో.. తమ లగేజీని మోస్తూ నిలబడాల్సిన పరిస్థితి ఉంది.  ప్రయాణికుల అవస్థలకు చెక్ పెట్టేందుకు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 

ప్రయాణికుల ఇబ్బందులపై సీరియస్ గా దృష్టి సారించిన ఆర్టీసీ.. గ్రేటర్ పరిధిలోని తిరిగే  సిటీ బస్సుల్లోప్రయోగాత్మకంగా లగేజీ ర్యాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల అభిప్రాయం తెలుసుకునేందుకు మొదటి విడత  150 బస్సుల్లో ఈ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. 

తొలుత బుధవారం (ఫిబ్రవరి 18) రెండు బస్సుల్లో ర్యాక్స్ ఏర్పాటు చేసి పరిశీలించింది. మియాపూర్ బస్ బాడీ నిర్మాణ యూనిట్ లో బస్సుల్లో  ర్యాక్ లు ఏర్పాటు చేశారు. దీనికోసం ఒక్కో బస్సుకు రూ. 15 వేల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం 150 బస్సుల్లో ర్యాక్ ల ఏర్పాటు పని జరుగుతోంది. త్వరలో ర్యాకులు ఏర్పాటు చేసిన బస్సులు రోడ్డెక్కనున్నాయి.

అయితే ర్యాక్ లు ప్రయాణికులకు ఉపయోగకరమైన విధంగా  ఉన్నాయా.. సిటీ బస్సు ల రద్దీ క్రమంలో ప్రయాణికులు వాటిని వినియోగించుకుంటారా అనేది స్టడీ చేసి  హైదరాబాద్ పరిధిలో తిరిగే మిగతా సిటీ  బస్సుల్లో వాటి ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న  తాజా నిర్ణయం ఎంతో  ఉపయోగకరమైంది..తక్కువ ఖర్చు తో కూడుకున్నది కావటంతో దీనికి సానుకూల స్పందన ఉంటుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.