Rana Daggubati : మృత్యువు అంచుదాకా వెళ్లి.. మళ్ళీ గెలిచి వచ్చా.. తన ఆరోగ్యంపై రానా ఎమోషనల్ కామెంట్స్!

Rana Daggubati :  మృత్యువు అంచుదాకా వెళ్లి.. మళ్ళీ గెలిచి వచ్చా.. తన ఆరోగ్యంపై రానా ఎమోషనల్ కామెంట్స్!

'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న  టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి. 'భల్లాలదేవ' గా వెండితెరపై ఎంత శక్తివంతంగా కనిపిస్తారో అందరికీ తెలిసిందే. కానీ, గత కొన్నేళ్లుగా ఆయన ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, ఆ సమయంలో ఆయన అనుభవించిన మానసిక వేదన గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తన కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ సమస్యల వల్ల తన జీవితం, కెరీర్ ఎలా తలకిందులయ్యాయో వివరిస్తూ రానా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మృత్యువుతో పోరాటం.. 

ఒకానొక దశలో రానా ఆరోగ్యం అత్యంత క్లిష్టంగా మారింది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో తన ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని రానా చెప్పుకొచ్చారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం బతకడం మాత్రమే. సినిమా కెరీర్, ఇమేజ్ గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. దాదాపు ఏడాది పాటు చికిత్స తీసుకున్నాక, కోలుకుని ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు నేను అద్దంలో నన్ను చూసుకుంటే నాకే గుర్తుపట్టలేనంతగా మారిపోయాను అని రానా ఆవేదన వ్యక్తం చేశారు. 

వరుణ్ తేజ్‌ను చూసి భయమేసింది!

తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి వివరిస్తూ రానా ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ తనను చూడటానికి వచ్చినప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వరుణ్ తేజ్ చాలా పొడవుగా, భారీగా ఉంటాడు. తనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అద్దంలో నన్ను నేను చూసుకోవడం కంటే, వరుణ్‌ను చూస్తుంటేనే పాత రానా కనిపిస్తున్నట్లు అనిపించింది. నేను ఉండాల్సిన రూపంలో తను ఉన్నాడు, కానీ నేను మాత్రం పూర్తిగా కృశించిపోయాను అని ఎమోషనల్ అయ్యారు.. ఆ సమయంలో తన కథలన్నీ వరుణ్‌కు ఇచ్చేసి, అతడినే ఆ పాత్రలు చేయమని చెబితే బాగుంటుందని కూడా అనిపించిందని చెప్పుకొచ్చారు.

అడ్వాన్స్‌లు వెనక్కి ఇచ్చేసి..

ఆరోగ్య సమస్యల వల్ల రానా శారీరకంగా చాలా బలహీనపడ్డానని రానా తెలిపారు. శస్త్రచికిత్సకు ముందు ఆయన కొన్ని భారీ యాక్షన్ సినిమాలకు సంతకం చేశాను. వాటిల్లో ఒక భారీ కాయుడైన మల్లయోధుడికథతో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇండియాకు తిరిగి వచ్చాక, తన ప్రస్తుత రూపం ఆ పాత్రలకు సరిపోదని భావించారు. తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని భావించి, తాను తీసుకున్న అడ్వాన్స్‌లన్నీ వెంటనే వెనక్కి ఇచ్చేసినట్లు తెలిపారు.. ఒక నటుడిగా తన ఇమేజ్ కంటే బాధ్యతకే ఆయన ప్రాధాన్యతనిచ్చినట్లు తెలిపారు. నేను నటుడిని కాకపోయి ఉంటే, ఈ ఆరోగ్య సంక్షోభం నుంచి బయటపడటం నాకు చాలా కష్టమయ్యేది అని రానా అన్నారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు!

ఆరోగ్యం కుదుటపడ్డాక రానా తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టారు. ఇప్పుడు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞ చాటుతున్నారు. 2025లో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సేతో కలిసి 'కాంత' చిత్రంలో నటించడమే కాకుండా సహ నిర్మాతగానూ వ్యవహరించారు. 'మిరాయ్' చిత్రంలో క్యామియో రోల్ చేయడంతో పాటు, ఈ ఏడాది రిలీజ్ అయిన 'పరాశక్తి'  చిత్రంలోనూ మెరిశారు. బుల్లితెరపై తనదైన శైలిలో సెలబ్రిటీలతో టాక్ షోను నిర్వహిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.