- ఇన్‌శాట్-3 డీఎస్ శాటిలైట్ ఫొటోలు రిలీజ్ చేసిన ఐఎండీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలతో వడగాల్పులు బెంబేలెత్తిస్తున్న వేళ ఇండియా మెటియోరాలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యధరా సముద్రం నుంచి పశ్చిమ తుఫాను గాలులు(వెస్ట్రన్ డిస్ట్రబెన్స్) ఉత్తర భారతదేశం వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ ప్రభావంతో త్వరలోనే మన దేశంలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ మేరకు ఇన్‌శాట్-3 డీఎస్ శాటిలైట్ పంపిన థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఫొటోలను ఐఎండీ గురువారం విడుదల చేసింది.
ఈ ఫొటోల ప్రకారం.. ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన మేఘాల సమూహంతో కూడిన ఒక వాయుగుండం ఏర్పడింది. ఇది క్రమంగా తూర్పు దిశగా ప్రయాణిస్తూ హిమాలయ ప్రాంతాలు, ఉత్తర మైదానాల వైపు కదులుతోంది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో విస్తారంగా తేమ చేరుతోంది.
ఈ తేమకు పశ్చిమ తుఫాను గాలులు తోడైతే రాబోయే కొద్ది రోజుల్లోనే వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, రాజస్తాన్, హర్యానా, యూపీ సహా మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. రాత్రి వేళల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో దూసుకొస్తున్న మేఘాలతో వర్షాలు కురిసి ఉత్తరాదికి ఊరటనివ్వనున్నట్లు ఐఎండీ పేర్కొంది.
