ఒక్కో కేసుకు తీర్పు ఇవ్వడానికి తీసుకుంటున్న టైం 122 వారాలు

ఒక్కో కేసుకు తీర్పు ఇవ్వడానికి తీసుకుంటున్న టైం 122 వారాలు
  • కేవలం 36 వారాలే విచారణ
  • వాదనలు పూర్తయ్యాక తీర్పు కోసం 9 వారాల టైం
  • 60% టైం ఇతర కారణాలకే
  • సాక్షులు, లాయర్లు, జడ్జిల గైర్హాజరూ కారణమే
  • ఐఐఎం కోల్​కతాతో స్టడీ చేయించిన కేంద్ర న్యాయ శాఖ

వాయిదా.. వాయిదా.. వాయిదా.. ఒక కేసు కోర్టు మెట్లెక్కిందంటే.. ఎన్ని వాయిదాలు చూడాలో! కరెక్ట్​గా తీర్పు వచ్చే టైంలోనూ మరో వాయిదా! ఫలితం ఆ కేసు పూర్తి కావడానికి ఏళ్లకేళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి. కర్ణుడి చావుకు కారణాలనేకమన్నట్టు.. కోర్టుల్లో తీర్పు ఆలస్యమవడానికీ ఎన్నో కారణాలున్నాయి. మరి, ఆ కారణాలేంటి? ఎందుకు లేట్​ అవుతోంది? ఒక్కో కేసుపై తీర్పు రావడానికి సగటున ఎన్ని రోజులు టైం పడుతోంది?.. వీటన్నింటిపై ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ – కోల్​కతా (ఐఐఎంసీ) స్టడీ చేసింది. ఎందుకు లేట్​ అవుతోందో తేల్చింది. స్టడీ బాధ్యతను గత ఏడాది కేంద్ర న్యాయ శాఖ, ఐఐఎంకు అప్పగించింది. ఐఐఎంకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ఆర్​. రాజేశ్​ బాబు, సుమంత బసు, ఇంద్రనీల్​ బోస్​లు ఈ స్టడీ చేశారు. పశ్చిమబెంగాల్​లోని 24 పరగణాస్​ జిల్లా కోర్టులోని 40కిపైగా కేసులను పరిశీలించారు.

రెండున్నరేళ్లు లేదా 122 వారాలు.. ఇదీ సగటున ఒక్కో కేసుపై కోర్టులు తీర్పు ఇవ్వడానికి తీసుకుంటున్న టైం. అందులో కేవలం 36 వారాలు ఆయా కేసులపై విచారణలు జరుగుతున్నాయి. మిగతా టైం అంతా ఆర్డర్ల కోసం ఎదురు చూపులు (దీనికే 22 వారాలు పడుతోంది), బిజీగా ఉండడం వల్లో లేదా లీవులు, ట్రాన్స్​ఫర్​ ఆర్డర్ల వల్లో జడ్జిల గైర్హాజరు (దీనికో 17 వారాలు) వంటి కారణాలతో తీర్పులు ఆలస్యం అవుతున్నాయి. మొత్తంగా చెప్పాలంటే 60 శాతం టైం విచారణలకు కాకుండా ఇతర కారణాలతోనే గడిచిపోతోంది. కోర్టు విచారణలు, పనితీరును సులభతరం చేయకపోవడమూ దానికి కారణమవుతోంది. ‘‘కేసు విచారణలో ఉండగా సాక్షులు కోర్టు ముందు హాజరు కాకపోవడం, లాయర్లు రాకపోవడం, సాగదీత వాదనలు, వాయిదాల వంటి కారణాలతో కోర్టు తీర్పులు ఆలస్యమవుతున్నాయి” అని ఐఐఎం స్టడీ తేల్చింది.

తీర్పు కోసం కనీసం 9 వారాలు

వాదనలు, విచారణ అంతా పూర్తయ్యాక తీర్పు ఇవ్వడానికి కోర్టులు కనీసం 9 వారాల టైం తీసుకుంటున్నాయి. ఆ 9 వారాలపాటు కేసు తీర్పును వాయిదా వేస్తున్నాయి. కోర్టు సెలవులు, స్ట్రైకుల వంటి కారణాలతో మరో 5 వారాల టైం వేస్ట్​ అవుతోంది. సరైన సమాచారం ఇవ్వలేకపోయినప్పుడు కేసులను కోర్టులు వాయిదా వేయడం పరిపాటిగా జరుగుతున్నదే. కేసులు ఎక్కువగా వాయిదా పడడానికి కారణం లాయర్లు ఎక్కువగా గైర్హాజరు అవడమేనని ఐఐఎం స్టడీ తేల్చింది. ‘‘ఒక్కో లాయరు ఒకేసారి చాలా కేసులను పట్టుకోవడం వల్ల అన్ని కేసుల్లో ఒకేసారి వాదనలు వినిపించలేకపోతున్నారు. ముఖ్యమైన కేసులను ముందు పూర్తి చేస్తున్నారు. దానికి తోడు ఆ టైంకు ఉన్న జడ్జి కాల పరిమితికి తగ్గట్టు లాయర్లు కేసుకు టైం ఫిక్స్​ చేసుకుంటున్నారు. ఆ జడ్జి హయాంలో కేసు తీర్పు రాకపోతే, కొత్త జడ్జి ముందుకు కేసును కొత్తగా తీసుకెళ్లాల్సి వస్తోంది” అని పేర్కొంది. ప్రస్తుతం కింది కోర్టులు 220 రోజులు పనిచేస్తున్నాయి. కానీ, కేసులు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ పని దినాలు సరిపోవట్లేదని, జడ్జిల నియామకాలను చేపట్టకపోవడమూ ఈ పరిస్థితికి మరింత ఎక్కువ కారణమవుతోందని ఐఐఎం ప్రొఫెసర్లు చెబుతున్నారు.

పవరున్నోళ్లకే

చట్టం కేవలం పవరు, డబ్బున్నోళ్ల కోసమేనన్న నమ్మకం జనాల్లో బాగా నాటుకుపోయిందని స్టడీ చేసిన ప్రొఫెసర్లు అన్నారు. న్యాయవ్యవస్థ సమాజంలోని అందరినీ సమానంగా చూడాల్సిన అవసరముందని చెప్పారు. అప్పుడే డబ్బున్నోళ్లు, డబ్బు లేనోళ్లు అనే రెండు వర్గాలకు సమాంతరంగా న్యాయం చేయగలుగుతారని అన్నారు. కేసు తీర్పుల ఆలస్యాన్ని తగ్గించే కార్యక్రమాలను రివ్యూ చేయాల్సిన అవసరం ఉందన్నారు. చాలా సూక్ష్మ స్థాయిలో కారణాలను తెలుసుకోవాలని చెప్పారు.

What delays delivery of justice in lower courts? IIM study finds out