పెళ్లి కాకుండా ఆడ మగ ఒకే హోటల్ రూమ్ లో ఉంటే నేరమా?

పెళ్లి కాకుండా ఆడ మగ ఒకే హోటల్ రూమ్ లో ఉంటే నేరమా?

పెళ్లి కాని స్త్రీ,పురుషులిద్దరూ ఒకే గదిలో కలిసుండటం తప్పేమీ కాదని, అది నేరమని ఏ చట్టంలో లేదని మద్రాస్ హైకోర్టు తెలిపింది. సహజీవనాన్నే నేరంగా పరిగణించనప్పుడు , ఒకే లాడ్జీలోని గదిలో ఇద్దరూ ఉండటాన్ని తప్పు పట్టలేమని చెప్పింది. అసలు విషయం ఏంటంటే..
కోయంబత్తూర్ లోని ఓ అపార్ట్ మెంట్ కు పోలీసు అధికారులు ఎటువంటి నోటీసులు, ఆదేశాలు లేకుండా సీల్ వేశారు. అందుకు కారణం ఆ అపార్ట్ మెంట్ ని పెళ్లి కాని జంటలు తమ అవసరాల కోసం వినియోగిస్తున్నారని టాక్. సోషల్ మీడియా ద్వారా ఆ విషయం తెలసుకున్న పోలీసులు.. ఆ లాడ్జీలో తనిఖీలు చేసి, ఆ గదుల్లో జంటలున్నారని గుర్తించి అపార్ట్ మెంట్ కి సీల్ వేశారు. దీనిపై ఆ లాడ్జీ యజమాని మద్రాస్ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు , రెవిన్యూ అధికారులు ఏ కారణం చేత తన లాడ్జీని సీల్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నాడు.
దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి M.S. రమేష్.. పెళ్లికాని జంటలను హోటల్ గదుల్లోకి అనుమతించడం చట్టవిరుద్ధమని ఎలా చెప్పగలరని పోలీసులను, రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అందుకు వారు ఎలాంటి సమాధానమివ్వలేదు. పెళ్లి కాని వ్యక్తులను హోటల్ గదులకు రాకుండా నిషేధించే చట్టాలు కానీ, నిబంధనలు కానీ ఏమీ లేవన్నారు. “ఇద్దరు వ్యక్తుల మధ్య లివ్-ఇన్ రిలేషన్ ని నేరంగా పరిగణించబడనప్పుడు, పెళ్లికాని జంట హోటల్ గదిలో ఉండటాన్ని నేరంగా అనుకోకూడదు. పెళ్లికాని జంట ఒకే గదిలో ఉన్నారన్న కారణంతో లాడ్జీకి సీలు వేయడం చట్టవిరుద్ధం, ”అని తీర్పు ఇచ్చారు.

అంతే కాకుండా ఆ గదుల్లో మద్యం సీసాలు ఉండటం.. ఆ లాడ్జి అక్రమంగా బార్‌ నిర్వహిస్తోందనీ చెప్పలేమని, లాడ్జిలో గడుపుదామని వచ్చే వారు మద్యం తెచ్చుకోకూడదని కూడా ఏ చట్టంలో లేదని అన్నారు. సీలు వేసే విషయంలో చట్ట ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించలేదు కాబట్టి వెంటనే సీల్ తొలగించాలని కోయంబత్తూరు కలెక్టరుకు న్యాయమూర్తి ఆదేశమిచ్చారు.