బీమా తీసుకునేటప్పుడు..  జర జాగ్రత్త

బీమా తీసుకునేటప్పుడు..  జర జాగ్రత్త

న్యూఢిల్లీ: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికీ బీమా ధీమా ఉండటం తప్పనిసరి. టెర్మ్‌‌ ఇన్సూరెన్స్‌‌ తీసుకుంటే కుటుంబానికి రక్షణ ఉంటుంది. ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. జీవితానికి ఎంతో ముఖ్యమైన టెర్మ్‌‌ ఇన్సూరెన్స్‌‌ ప్లాన్‌‌ను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తప్పు జరిగినా నష్టపోవాల్సి ఉంటుంది. బీమా పాలసీ కొనేవాళ్లు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.
తగిన మొత్తానికి పాలసీ తీసుకోవాలి
టెర్మ్‌‌ ఇన్సూరెన్స్‌‌ తీసుకున్న మనిషి మరణిస్తే ఆయన/ఆమెపై ఆధారపడ్డ వాళ్లకు పాలసీలో పేర్కొన్న మొత్తం (సమ్‌‌ ఎష్యూర్డ్‌‌) చేతికి వస్తుంది. చిన్న మొత్తానికి పాలసీ తీసుకుంటే తక్కువ డబ్బే వస్తుంది. అది ఒకటిరెండేళ్లకు కూడా సరిపోకపోవచ్చు. మన కుటుంబ భవిష్యత్‌‌ అవసరాలను చూసుకొని టెర్మ్‌‌ ఇన్సూరెన్స్‌‌ ప్లాన్‌‌ను ఎంచుకోవాలి. తక్కువ ప్రీమియం పడుతుందనే ఆలోచనతో చాలా మంది నామమాత్రపు మొత్తానికి పాలసీ తీసుకుంటారని, ఇది చాలా తప్పని పాలసీఎక్స్‌‌ డాట్‌‌కామ్‌‌ ఫౌండర్‌‌, సీఈఓ నావల్‌‌ గోయల్‌‌ అన్నారు. ఇన్‌‌ఫ్లేషన్‌‌ రేటును, తనపై ఆధారపడ్డ వారి అవసరాలనూ లెక్కలోకి తీసుకోవడం తప్పనిసరి అన్నారు. 
కంపెనీ కూడా ముఖ్యమే...
కేవలం ప్రీమియం తక్కువ ఉందనే కారణంతో బీమా కంపెనీని ఎంచుకోవడం సరికాదని ఫైనాన్షియల్‌‌ ఎక్స్‌‌పర్టులు అంటారు.  ఇన్సూరెన్స్‌‌ ప్లాన్‌‌, క్లెయిమ్‌‌ రేషియో బాగుండాలి. పాలసీ ప్రయోజనాలు మనకు అనుకూలంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆర్థికంగా బలంగా ఉన్న కంపెనీల పాలసీ అయితే సెటిల్‌‌మెంట్‌‌ త్వరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. పాలసీ కొనేముందు ఇవన్నీ పరిశీలించాలి.
ఆలస్యం అసలే వద్దు...
వయసు ఎంత ఎక్కువ ఉంటే పాలసీ ప్రీమియం అంత ఎక్కువ అవుతుంది. తక్కువ ఉంటే ప్రీమియమూ తగ్గుతుంది. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తికి రూ.50 లక్షల విలువైన టెర్మ్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీ కావాలంటే ఏడాదికి రూ.తొమ్మిది వేల వరకు కట్టాలి. 25 ఏళ్ల వ్యక్తి అయితే రూ.ఐదు వేలు కడితే చాలు. పాలసీ కొనడం ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టపోతామని పాలసీబజార్ డాట్‌‌కామ్ సీనియర్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ సజ్జా ప్రవీణ్‌‌ చౌదరి అన్నారు. ఏటా ప్రీమియం కట్టడాన్ని కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ మరవొద్దని స్పష్టం చేశారు. 
తప్పుడు వివరాలు ఇవ్వొద్దు
తప్పుడు సమాచారం ఇవ్వడం కొందరు తమ మెడికల్‌‌ హిస్టరీ, ఆర్థిక స్థితి వంటి  కీలకమైన సమాచారాన్ని దాస్తుంటారు. ఇలా చేయడం వల్ల  క్లెయిమ్ సెటిల్‌‌మెంట్‌‌ సమయంలో చాలా ఇబ్బందులు వస్తాయి. సమ్‌‌ ఎష్యూర్డ్‌‌ రాకపోవచ్చు కూడా.  వ్యాధులు, సిగరెట్‌‌, ఆల్కహాల్‌‌ వంటి అలవాట్లు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పెంచుతాయని ప్రవీణ్‌‌ అన్నారు. ‘‘పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ఇట్లాంటి వివరాలను దాచడం చాలా తప్పు. ఉదాహరణకు, పాలసీ సమయంలోనే పాలసీహోల్డర్‌‌ ఆరోగ్య పరిస్థితి కారణంగా మరణించాడనుకుందాం. పాలసీ డాక్యుమెంటులో వ్యాధుల వివరాలను వెల్లడించకుంటే  బీమా సంస్థలు క్లెయిమ్‌‌ను పూర్తిగా తిరస్కరించవచ్చు’’ అని అన్నారు.

పన్ను ఆదా కోసం పాలసీని కొనడం వేస్ట్​
జీవిత బీమా పాలసీలు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి ప్రకారం రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా ప్రయోజనాన్ని అందిస్తాయి.  ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(10డీ) ప్రకారం  మెచ్యూరిటీ అయ్యాక లేదా పాలసీదారు మరణించిన తర్వాత  ఏదైనా బోనస్, బీమా మొత్తం వస్తే ఎలాంటి పన్నూ ఉండదు. అయితే పన్నులాభాల కోసం మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనకూడదు.  ఇన్‌‌కమ్ ట్యాక్స్‌‌ ఆదా చేసేందుకు చాలా మంది చివరి నిమిషంలో బీమాను కొంటారు. ఇది పెద్ద తప్పు. ఎందుకంటే పన్ను ఆదా లక్ష్యం అయినప్పుడు, ప్రీమియాన్ని పెంచుకుంటూ పోతారు. చివరికి మిగిలేది నష్టమే!
షార్ట్‌‌టర్మ్‌‌ పాలసీలు వద్దు
పాలసీదారుడు మరణిస్తే నామినీకి డెత్‌‌ బెనిఫిట్‌‌ మొత్తాన్ని చెల్లిస్తారు. జీవించి ఉంటే ఎటువంటి మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదు. పాలసీ కాలంలో బీమా సంస్థకు చెల్లించిన మొత్తం (ప్రీమియం) మాత్రమే చేతికి వస్తుంది.  ప్రీమియం డబ్బు ఆదా చేయడానికి తక్కువ కాలం/కవరేజ్ టర్మ్‌‌ని ఎంచుకోవడం కూడా పొరపాటే అవుతుంది. పాలసీని తక్కువ కాలానికి కొనుగోలు చేస్తే అది త్వరగా ముగుస్తుంది. ఫలితంగా ప్రస్తుత టర్మ్ పాలసీని రెన్యువల్‌‌ చేసుకోవాలి లేదా కొత్తదాన్ని కొనుగోలు చేయాలి. ఇందుకు అధిక ప్రీమియం రేట్లను భరించాలి. 
మెడికల్​ హిస్టరీని ఇవ్వాలి
మెడికల్‌‌ హిస్టరీని ఇవ్వకపోవడం అతి పెద్ద తప్పు. మెడికల్​ వివరాలను అడిగే కంపెనీ పాలసీని తీసుకోవడం బెటర్‌‌. పాలసీని జారీ చేసేటప్పుడు సరైన పూర్తి ఆరోగ్య వివరాలను ఇస్తే పాలసీ సరిగ్గా ఉంటుంది. దీనివల్ల క్లెయిమ్ దశలో ఎలాంటి సమస్యా ఉండదు.  రిఫరెన్స్  రికార్డుల కోసం బీమా సంస్థ నుండి పాలసీహోల్డర్‌‌ మెడికల్ రిపోర్టులను తీసుకోవచ్చు. జనరల్‌‌ చెకప్‌‌ల కోసం వాటిని ఉపయోగించుకోవచ్చు.