ఓటు హక్కు ఎప్పుడిస్తరు?

ఓటు హక్కు ఎప్పుడిస్తరు?

సిద్దిపేట, వెలుగు : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు ఒక్కొక్కటిగా అన్నీ కోల్పోతున్నారు. మొన్న భూములు పోతే...తర్వాత ఇండ్లు ..ఇప్పుడేమో ఓట్లు కూడా కోల్పోయారు. భూములు, ఇండ్ల పరిహారం గురించి సతాయించిన ఆఫీసర్లు ఓట్ల తొలగింపు విషయం చెబితే ‘ మళ్లీ ఎంట్రీ చేయించుకోండి’ అని ఉచిత సలహా ఇస్తున్నారు. కానీ దానికి తగ్గ ఏర్పాట్లు మాత్రం చేయడం లేదు. 
 

ముంపు గ్రామాల నుంచే 8,483 ఓట్లు 

సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం  ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, వేములఘాట్​, పల్లెపహాడ్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం గ్రామాలు మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో ముంపుకు గురయ్యాయి. ఇక్కడి నిర్వాసితులను ఆరు నెలల కింద గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లిలోని ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మించిన ఇండ్లలోకి తరలించారు. ముంపు గ్రామాల్లో ఓట్లను తొలగించిన ఆఫీసర్లు, కొత్త ఇండ్లు ఉన్నచోట ఓటు హక్కు కల్పించలేదు. జిల్లాలో మొత్తం 18,071 ఓట్లు తొలగించగా ఇందులో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోనే 8,483 ఓట్లను తీసేశారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే తొగుట మండలంలోని ఆరు ముంపు గ్రామాలకు సంబంధించి 6,668, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కొండపాక మండలం ఎర్రవల్లి, సింగారం గ్రామాల్లో 1815 ఓట్లు తొలగించారు.  
 

కలెక్టర్ చెప్పినా అమలు కాలే? 

మల్లన్నసాగర్ ముంపు గ్రామాలను ముట్రాజ్ పల్లి ఆర్అండ్ఆర్ కాలనీకి తరలించిన నేపథ్యంలో గత నవంబరులో వారికి ఓటు హక్కు కల్పించడానికి కలెక్టర్ స్పెషల్​ ఆర్డర్స్​ ఇచ్చారు. దీనికోసం కాలనీలో క్యాంప్​ పెడతామని, ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. నవంబరు నెలాఖరు వరకు క్యాంపులను నిర్వహిస్తామని చెప్పినా ఇంతవరకు పెట్టింది లేదు. కాగా, కొత్త ఓటరు కార్డుల కోసం పేర్లు నమోదు చేసుకుంటే పరిహారం వస్తుందో రాదోనన్న అపోహలో ఇక్కడి నిర్వాసితులున్నారు. 
 

అడ్రస్​ లేనోళ్లయిన్రు

ఆర్అండ్ఆర్ కాలనీలో ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇండ్లు కేటాయించినా, ఇప్పటికీ వారికి అడ్రస్సే లేదు. గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి ఇప్పటివరకు ఇంటి నంబర్లు ఇవ్వలేదు. కొందరు మీ సేవా కేంద్రాల ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రయత్నించినా ఆర్అండ్ఆర్ కాలనీ పేరిట ఎలాంటి అడ్రస్​ ప్రూఫ్​ లేకపోవడంతో ఇవ్వడం లేదు. ఆరు నెలలవుతున్నా ఇంటి నంబర్లు ఇవ్వకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు చెబుతున్నారు. ఇప్పటికీ కరెంట్​బిల్లు కూడా ఇంటి ఓనర్ ​పేరున కాకుండా ఆర్అండ్ఆర్ కాలనీ ముట్రాజ్ పల్లి పేరిటే వస్తోంది.  

ఆఫీసర్ల మూలంగా ఓట్లు కోల్పొయాం


కాలనీలో ఇండ్లు కేటాయించినా ఇప్పటికీ మున్సిపాలిటీ నుంచి నంబర్లు ఇవ్వలేదు. ఓటరుగా నమోదు చేసుకోవాలనుకుంటే సరైన అడ్రస్​ప్రూఫ్​ లేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు అందరికీ ఇంటి నంబర్లతో పాటు ఓటు హక్కు కూడా కల్పించాలి.                                                                                                                                                                         – పి.రవి, ఆర్ అండ్ఆర్ కాలనీ


పరిహారం వస్తదో రాదో అని  భయపడతున్నరు


మాకేమైనా డౌట్స్​వస్తే ఆఫీసర్లు సరైన ఆన్సర్​ఇవ్వడం లేదు. చాలామంది పరిహారాలు పెండింగ్ లో ఉండగానే కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చెప్పారు. దీంతో అందరిలో ఆందోళన నెలకొంది. పరిహారం రాదేమోనని భయపడుతున్నారు. ఇంటి నంబర్లు కూడా ఇయ్యలే.  
                                                                                                                                                                                                                                                                          కనకరాజు, ఆర్ అండ్ఆర్ కాలనీ

మరోసారి స్పెషల్​ క్యాంప్​ నిర్వహిస్తాం
ఓటర్​ లిస్టుల నుంచి తొలగించిన మల్లన్నసాగర్ ముంపు గ్రామాల వారి కోసం ఆర్అండ్ఆర్ కాలనీలో ఇప్పటికే ఓసారి ఓటరు నమోదు క్యాంప్​ నిర్వహించాం. మరోసారి స్పెషల్​ క్యాంపు పెడతాం. అడ్రస్ ప్రూఫ్​తో సంబంధం లేకుండా కాలనీలో ఉండే వారందరికి ఓటు హక్కు కల్పిస్తాం.                                                                                 - కె.అనంతరెడ్డి, ఆర్డీఓ, సిద్దిపేట