మనం వండుకునే ప్రతి వంటకంలో రకరకాల మసాలాలు వాడుతుంటాం, కానీ వాటన్నింటికంటే ముఖ్యమైనది, రుచిని ఇచ్చేది కేవలం ఉప్పు మాత్రమే. ఉప్పును మనం వంటల్లోనే కాకుండా, మందుల తయారీలో, రకరకాల పరిశ్రమలలో కూడా ఎక్కువగా వాడుతుంటాము. అయితే మన దేశంలో ఉప్పు ఉత్పత్తి చాలా ఎక్కువగా జరుగుతుంది.
ప్రపంచంలోనే అత్యధికంగా ఉప్పును తయారుచేసే దేశాల్లో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. మరి మన దేశంలో "ఉప్పు రాజధాని" అని ఏ నగరాన్ని పిలుస్తారో మీకు తెలుసా..? రాష్ట్రాల పరంగా చూస్తే గుజరాత్ మొదటి స్థానంలో ఉంది, కానీ ఒక నగరం విషయానికి వస్తే మాత్రం ఆ గుర్తింపు తమిళనాడులోని తూత్తుకుడి (ట్యుటికోరిన్) నగరానికి దక్కింది.
తూత్తుకుడిని "ఉప్పు రాజధాని" అని ఎందుకు
ఈ నగరంలో ప్రతి సంవత్సరం మార్చి నుండి అక్టోబర్ వరకు ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉప్పు తయారు కావడానికి సముద్రపు నీరు త్వరగా ఆవిరి అవ్వాలి. ఇక్కడి వేడి వాతావరణం వల్ల నీరు త్వరగా ఆవిరై ఉప్పు బాగా తయారవుతుంది.
తూత్తుకుడి జిల్లాలో ఉప్పు పండించడం కోసమే దాదాపు 25,000 ఎకరాల భూమి ఉంది. సముద్రపు నీటిని లేదా భూగర్భ ఉప్పు నీటిని ఈ మడులలోకి చేర్చి, ఎండబెట్టి ఉప్పు స్ఫటికాలను తయారు చేస్తారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అయోడైజ్డ్ ఉప్పు (Iodized Salt) ఫ్యాక్టరీని ఈ నగరంలోనే ఎస్.కె.ఎస్.సి. నాడరాజన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
►ALSO READ | బొద్దింక జనతా పార్టీ వెనకున్న ఈ అభిజీత్ దీప్కే ఎవరు..? టార్గెట్ ఏంటి..?
ఇక్కడ ఉప్పు పరిశ్రమ చాలా పెద్దది కావడం వల్ల వేల మందికి ఉపాధి దొరుకుతోంది. ఉప్పును సేకరించడం, ప్యాక్ చేయడం, స్టోర్ చేయడం సహా ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం వంటి పనుల ద్వారా ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు.
తూత్తుకుడి ఉప్పు పరిశ్రమ విషయాలు
*తూత్తుకుడి నగరం ప్రతి సంవత్సరం దాదాపు 12 లక్షల టన్నుల ఉప్పును ఉత్పత్తి చేస్తుంది.
*వంద సంవత్సరాలకు పైగా ఈ నగరం ఉప్పు ఉత్పత్తిలో ముందంజలో ఉంది.
*తమిళనాడు రాష్ట్రంలో తయారయ్యే మొత్తం ఉప్పులో 9 శాతం వాటా ఒక్క తూత్తుకుడి నుంచే వస్తుంది.
*భారతదేశం మొత్తం మీద తయారయ్యే ఉప్పులో తమిళనాడు వాటా దాదాపు 12 శాతంగా ఉంది.
*ప్రపంచవ్యాప్తంగా ఉప్పు ఉత్పత్తిలో చైనా, అమెరికాల తర్వాత మన భారతదేశమే మూడవ స్థానంలో ఉంది.
*ఇక్కడి నుండి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, జపాన్, మాల్దీవులు వంటి దేశాలకు ఉప్పు ఎగుమతి అవుతుంది.
భారతదేశంలో ఉప్పు ఉత్పత్తి ఎలా జరుగుతుంది?
రాష్ట్రాల పరంగా చూస్తే భారతదేశంలో అత్యధికంగా ఉప్పును పండించే రాష్ట్రం గుజరాత్. దేశంలోని మొత్తం ఉప్పు ఉత్పత్తిలో గుజరాత్ వాటా 76 శాతం. దీని తర్వాత 12 శాతం వాటాతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. గుజరాత్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న..., తమిళనాడులోని తూత్తుకుడి నగరం ప్రత్యేకత చాటుకుంటూ "భారతదేశపు ఉప్పు రాజధాని"గా పేరు తెచ్చుకుంది. ఇక్కడి ప్రజలకు ఉప్పు అనేది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, వారి జీవితంలో ఒక భాగం.
