చర్యలు తప్పవు.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్

చర్యలు తప్పవు.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్

సియోల్: తమ దేశంపై తప్పుడు ప్రచారం చేస్తున్న దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా వార్నింగ్ ఇచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన నిరసనకారులు.. ఉత్తర కొరియాలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, కిమ్ న్యూక్లియర్ విధానాలను తప్పుపడుతూ వారం రోజుల నుంచి గ్యాస్ బెలూన్లలో కరపత్రాలను బార్డర్ మీదుగా వదులుతున్నారు. దీనిని ఉత్తర కొరియా తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఆదివారం హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కొరియాపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నిర్ణయాన్ని సైన్యానికే వదిలేస్తామని హెచ్చరించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. బార్డర్ లోని రెండు దేశాల అనుసంధాన కార్యాలయాన్ని నాశనం చేస్తామని బెదిరించినట్లు పేర్కొంది. తమ దేశానికి వ్యతిరేకంగా, కర పత్రాల ద్వారా తప్పుడు ప్రచారం సాగించడం యుద్ధానికి ముందస్తు దాడి చర్యగానే భావించాలని, అలాంటి తప్పుడు ప్రచారాన్ని ఆపడంలో దక్షిణ కొరియా ఫెయిల్ అయిందని కిమ్ యో జోంగ్ మండిపడినట్లు పేర్కొంది.