హర్యానాలో బీజేపీ పుంజుకుందా?

హర్యానాలో బీజేపీ పుంజుకుందా?

హర్యానాలో బీజేపీ హవా కొనసాగుతోంది. మరోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా.. ప్రతిపక్షాల అనైక్యత, సోషల్​ఇంజనీరింగ్​అధికార పార్టీకి కలిసొస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు నామమాత్రంగా ఉన్న పార్టీ 2014లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 47 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నియామకాల్లో అవినీతిని అడ్డుకుని నిరుద్యోగుల అభిమానాన్ని, హెచ్చార్​ఏ ఆపేసి ఉద్యోగుల నిరసననూ బీజేపీ మూటగట్టుకుంది. పంజాబీ నేత మనోహర్​లాల్​ఖట్టర్​ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడంపై జాట్​వర్గాలు మండిపడుతున్నాయి. ఇలా భిన్న వర్గాల ప్రజలు ఖట్టర్​సర్కారుపై అసంతృప్తితోనే ఉన్నారు. ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీని ఎదుర్కొనే ధీటైన ప్రతిపక్షంలేకపోవడం పార్టీకి కలిసొస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఇండియన్​నేషనల్​లోక్​దళ్(ఐఎన్ఎల్​డీ)లో కుటుంబ చిచ్చు, కాంగ్రెస్​పార్టీకి ప్రజాదరణ తగ్గడం.. బీజేపీకి కలిసొస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

ఓబీసీలే కీలకం..

రాష్ట్రంలో పది లోక్​సభ స్థానాలు ఉండగా.. ఫరీదాబాద్, కురుక్షేత్ర,  గుర్గావ్ లలో ఓబీసీలదే నిర్ణయాత్మక పాత్ర. గుజ్జర్లు, సైనిస్, యాదవులతో పాటు సోనిపట్​లో బ్రాహ్మణులు, కర్నాల్​లో పంజాబీల ప్రభావం ఎక్కువ. అంబాలా, సిర్సా స్థానాలను ఎస్సీ అభ్యర్థులకు రిజర్వ్​చేసింది. తాజాగా కుటుంబ గొడవలతో ఐఎన్ఎల్​డీ ముక్కలైంది. చౌతాలా మనవడు దుష్యంత్ స్థాపించిన​ జననాయక్ ​జనతా పార్టీ (జేజేపీ) వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఐఎన్ఎల్​డీ బలహీనంగా మారింది. ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచే పరిస్థితే లేదని సమాచారం. అంతర్గత గొడవలతో కాంగ్రెస్​సతమతమవుతోంది. లోక్​తంత్ర సురక్ష పార్టీ(ఎల్​ఎస్పీ)తో కలిసి బీఎస్పీ ఎన్నికల బరిలోకి దిగింది. ఆప్, జేజేపీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇలా ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బీజేపీ ఈసారి గట్టెక్కుతుందని రాజకీయ వర్గాల అంచనా.

ఎక్కడెక్కడ ఎవరెవరు..

ఫరీదాబాద్: కాంగ్రెస్​పార్టీ తరఫున మాజీ ఎంపీ అవతార్​సింగ్​భాదన పోటీ చేస్తున్నారు. చివరి నిమిషంలో లాలిత్​నగార్​కు కేటాయించిన టికెట్ ను అవతార్​సింగ్​ లాగేసుకున్నారు. ఈ మార్పుపై పార్టీ కేడర్​అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

గుర్గావ్:  సిట్టింగ్​ఎంపీ, కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్​సింగ్​ బీజేపీ తరఫున, అజయ్​సింగ్​కాంగ్రెస్​తరఫున పోటీ చేస్తున్నారు.

హిస్సార్: జేజేపీ నుంచి బరిలోకి దిగిన దుష్యంత్​చౌతాలా ముందంజలో దూసుకువెళుతున్నారు. కాంగ్రెస్ ​నుంచి భవ్య బిష్ణోయ్ పోటీ చేస్తున్నారు.

రోహ్ తక్: కాంగ్రెస్​టికెట్ తో పోటీ చేస్తున్న దీపేందర్​హుడా వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు అంచనా.

అంబాలా: బీజేపీ, కాంగ్రెస్​ల మధ్య టఫ్​ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్​సీనియర్​నేత, మాజీ కేంద్ర మంత్రి కుమారి సెల్జా, బీజేపీ సిట్టింగ్​ఎంపీ రతన్​లాల్​కటారియాను ఢీ కొంటున్నారు.

సోనిపట్: కాంగ్రెస్​సీనియర్​నేత భూపిందర్​హుడా బీజేపీ సిట్టింగ్​ఎంపీ సతీష్​కౌశిక్​తో తలపడుతున్నారు. బ్రాహ్మణులు కౌశిక్​వైపు నిలిచినా భూపిందర్ కే విజయావకాశాలు ఎక్కువని వినిపిస్తోంది.

సిర్సా: పీసీసీ ప్రెసిడెంట్​అశోక్​తన్వర్, బీజేపీ నుంచి సునితా దగ్గల్, సిట్టింగ్​ఎంపీ, ఐఎన్ఎల్​డీ నేత చరణ్​సింగ్​రోరి ల మధ్య పోటీ ఉంది.

భివాణి–మహేంద్రగఢ్: బీజేపీ ఎంపీ ధరంబీర్, కాంగ్రెస్​నేత శృతి చౌదరిల మధ్య పోరు హోరాహోరీగా సాగినా, నాన్​జాట్​కమ్యూనిటీ ఓటర్లను ఆకట్టుకోవడం ద్వారా ధరంబీర్ విజయాన్ని అందుకుంటారని అంచనాలు వినిపిస్తున్నాయి.

అంబాలా, కురుక్షేత్ర: ఈ రెండు చోట్లా బీజేపీకి గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మోడీ హవాతో అధికారంలోకి..

2014  ఏడాదికంటే ముందు హర్యానాలో బీజేపీ ఉనికి నామమాత్రమే. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ వాటా కేవలం నాలుగే. మోడీ హవాతో గత ఎన్నికల్లో అధికారం చేపట్టింది. పది లోక్​సభ స్థానాల్లో ఏడింటిని  గెల్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 47 సీట్లు, కాంగ్రెస్​పార్టీ 15 సీట్లు, ఐఎన్ఎల్​డీ 12 సీట్లను, అకాలీ దళ్, బీఎస్పీ ఒక్కో సీటును, హర్యానా జనహిత్​కాంగ్రెస్​రెండు స్థానాలను, ఇండిపెండెంట్లు 5 సీట్లను గెల్చుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియ వెనక బీజేపీ సోషల్​ ఇంజనీరింగ్​స్ట్రాటజీ ఉందని రాజకీయ వర్గాలు
చెబుతున్నాయి.