కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి.. లేకపోతే బీజేపీతో దోస్తీ కట్

కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి.. లేకపోతే బీజేపీతో దోస్తీ కట్

జైపూర్: కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోకపోతే బీజేపీతో దోస్తీ గురించి పునరాలోచిస్తామని రాష్ట్రీయ లోక్‌‌తంత్రిక్ పార్టీ హెచ్చరించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఈ పార్టీ బీజేపీతో కలసి రాజస్థాన్‌లో పోటీ చేసింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని లేకపోతే బీజేపీతో దోస్తీపై పునరాలోచన చేస్తామని, కూటమి నుంచి తప్పుకోవడానికీ సిద్ధమేనని ఆర్ఎల్‌‌పీ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్యే హనుమాన్ బెనీవాల్ స్పష్టం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంతోపాటు ఢిల్లీలో రైతులతో చర్చలు జరపాలన్నారు. ‘మేం రైతుల పక్షాన ఉన్నాం. ఒకవేళ అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం. ప్రధాని మోడీ, అమిత్ షా రైతులతో చర్చలు జరపాలి. దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహించేందుకు రైతులకు అవకాశం కల్పించాలి. రైతులతో అమర్యాదగా వ్యవహరిస్తే మాత్రం ఢిల్లీని ఘెరావ్ చేయడానికి అన్నదాతలు వీధుల్లోకి వస్తారు’ అని బెనీవాల్ పేర్కొన్నారు.