పేరు కోసం ఉద్యమిస్తున్న మహిళలు

పేరు కోసం ఉద్యమిస్తున్న మహిళలు

ఒక మనిషికి ఐడెంటిటీ అతని పేరు. అలాంటిది అఫ్గనిస్తాన్ లో పేరు చెప్పుకునేందుకు ఆడవాళ్లకు స్వేచ్ఛ లేదు. బర్త్ సర్టిఫికెట్స్ నుంచి సమాధి శిలాఫలకం దాకా ఎక్కడా వాళ్ల పేరు కనిపిం చకూడదు. ఒకవేళ పేరు చెప్పుకునే సాహసం చేస్తే కఠినంగా శిక్షిస్తారు. వందల ఏండ్లుగా కొనసాగుతున్న ఈ వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంది అక్కడ. ‘పేరులో ఏముంది ?’ అనేవాళ్లకు చెంపపెట్టుగా.. ‘వేర్ ఈజ్ మై నేమ్’ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అక్కడి ఆడవాళ్లు.

 

అఫ్గనిస్తాన్ లో ఆడవాళ్లకు పుట్టిన వెంటనే పేరు పెట్టరు. చాలా టైం తీసుకుంటారు. ఎందుకంటే బర్త్ సర్టిఫికెట్స్ లో వాళ్ల పేర్లు ఉండవు కాబట్టి. వెడ్డింగ్ ఇన్విటేషన్స్, హాస్పిటల్ బిల్లులు , డ్రైవింగ్ లైసెన్స్ లు.. అంతేకాదు బయటివాళ్లకు తమ పేర్లు చెప్పొద్దని ఆంక్షలు కూడా విధిస్తుంటారు. బంధువులు వరుస పెట్టి పిలుచుకుంటారు. బయటి వాళ్లు తండ్రి లేదా భర్త పేరు పెట్టి పిలుస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని ఇంకకొనసాగ నివ్వకూడదని అనుకుంది లాలెహ్ ఒస్మానీ. మూడేళ్ల క్రితమే ‘వేర్ ఈజ్ మై నేమ్’ ఉద్యమాన్న మొదలుపెట్టింది. ఆడవాళ్లు స్వేచ్ఛగా తమ పేరును బయటి ప్రపంచానికి చెప్పుకునే వీలు కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. రీసెంట్ గా రెబియా అనే మహిళ విషయంలో జరిగిన ఉదంతం ఒస్మానీ పోరాటానికి సపోర్ట్ పెరిగేలా చేసింది.  వెస్ట్ అఫ్గనిస్తాన్ లో రెబియా అనే మహిళకి కరోనా సోకింది. ఆమె డాక్టర్ దగ్గర తన పేరు చెప్పింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై ఆమె పేరు ఉండటంతో రెబియా భర్తకి కోపం వచ్చింది. ఆమెను చితకబాదాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా నలుగురికి తెలియడంతో వేర్ ఈజ్ మై నేమ్ మూమెంట్ మళ్లీ ఊపందుకుంది.

వ్యభిచారం వైపు..

వేర్ ఈజ్ మై నేమ్ క్యాంపెయిన్‌‌ ఈ దఫా పోరాటానికి సెలబ్రిటీలు, యాక్టివిస్టుల సపోర్ట్ లభిస్తోంది. రోడ్ల మీద వాల్ పోస్టర్లు, సోషల్ మీడియాలోనూ ఉవ్వె త్తున కొనసాగుతోంది. ‘పేరు చెప్పుకోవడం మనిషికి ఉండే హక్కు. దానికి లింగ వివక్ష ఆపాదించడం సరికాదు. ఆ హక్కుని అడ్డుకోవాలని చూడటం నేరం అంటోంది’ 28 ఏళ్ల ఒస్మానీ. అంతేకాదు ఇది హ్యూమన్ ఎమోషన్స్ ని కూడా దెబ్బతీస్తోందని ఆమె వాదిస్తోంది. భర్త, తండ్రి చనిపోయిన వాళ్లు, విడాకులు తీసుకున్న వాళ్లు సొంతంగా బతకాలనుకుంటారు. అలాంటి సందర్భాల్లోనూ పేరు చెప్పుకోవడానికి వీల్లేకుండా పోతోంది. సర్టిఫికెట్స్ లో పేరు లేకపోవడంతో ఎక్కడా జాబ్ లు దొరకడం లేదు. ఆకలి చావులకు భయపడి పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లి వ్యభిచారం చేస్తున్నారు కొందరు ఆడవాళ్లు. ఈ పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని, అఫ్గాన్ ఆడవాళ్లు గౌరవంగా బతికే రోజులు రావాలని కోరుకుంటోంది ఒస్మానీ. అయితే ఇప్పటికే ఈ మూమెంట్లో తొలి అడుగు పడింది. బర్త్ సర్టిఫికెట్స్ తో పాటు ఇతర వాటిల్లోనూ ఆడవాళ్ల పేర్లు చేర్చేందుకు అఫ్గాన్ సర్కా ర్ పై ఒత్తిడి పెరుగుతోంది. త్వరలోనే విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది ఒస్మానీ. మరోపక్క ట్రెడిషన్ ను, కుటుంబ గౌరవాల్ని దెబ్బతీసే ఇలాంటి ట్రెండ్ కు తాము వ్యతిరేకమంటూ కొందరు ఆడవాళ్లు ఉద్యమించడం కొసమెరుపు.