పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి కోసం స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మహిళలు ఆందోళన చేపట్టారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని సరఫరా చేస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ...ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కనీసం తాగునీటిని కూడా సరఫరా చేయడం లేదని వాపోతున్నారు. తమ గ్రామానికి నీటి సరఫరా చేయాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
వానాకాలంలోనే తాగునీటికి కటకట ఏర్పడితే ఎండాకాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటుందన్నారు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని మహిళలు కోరుతున్నారు.

