- రాంలీలా మైదానంలో భారీ సభ పెట్టి కేంద్రంపై ఒత్తిడి తెద్దామని పిలుపు
హైదరాబాద్,వెలుగు: మహిళలు కచ్చితంగా పవర్ఫుల్ పొజిషన్ లో ఉండాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్సీఆర్ డబ్ల్యూ ఆధ్వర్యంలో శనివారం హిమాయత్ నగర్లో చేపట్టిన 'చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్స్ సాధన' సభలో ఆమె మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును సాధించాలంటే మహిళల శక్తిని ప్రదర్శించాల్సిందేనని అన్నారు.
ఢిల్లీలో రామ్ లీలా మైదానంలో భారీ సభ నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని పిలుపునిచ్చారు. మహిళా కోటా సాధన కోసం అన్ని మహిళా సంఘాలతో కలిసి తాము పని చేస్తామన్నారు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలని తాను ధైర్యంగా ముందడుగు వేసి పార్టీ పెట్టానని చెప్పారు. తమ పార్టీలో 33 శాతానికి తగ్గకుండా మహిళలకు సీట్లు ఇస్తామన్నారు. సరైన నాయకత్వం ఉంటే 50 శాతం సీట్లను ఇచ్చే ప్రయత్నం చేస్తానన్నారు.
ఓట్లు వేయబోమని చెప్పాలి
రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఓట్లకే ప్రాధాన్యమిస్తాయని, మహిళా బిల్లు అమలు చేయకపోతే ఓట్లు వేయబోమని మహిళలంతా గట్టిగా చెప్పాలని సూచించారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటా కూడా ఉండాల్సిన అవసరముందని చెప్పారు. ఇటీవల తనను కలుస్తున్న చాలా మంది మహిళలు మనకు రిజర్వేషన్లు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారని, కానీ మహిళలను ఒక స్థాయి వరకు మాత్రమే ఎదగనిస్తారని ఆ తర్వాత అడ్డుకట్ట వేస్తారని చెప్పారు.
ఆ పరిస్థితి లేకుండా ఎదగాలంటే మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు అవసరమన్నారు. అదే విధంగా మహిళా లీడర్లను తయారు చేసుకోవాల్సిన అవసరముందని సూచించారు. ఇందుకోసం స్పెషల్ గా లీడర్ షిప్ ట్రైనింగ్ డ్రైవ్ లు చేపట్టాలన్నారు. ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు గొట్టిముక్కల పద్మారావు కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు
