హైదరాబాద్: బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బావబామ్మర్దులు తోడేళ్ల లెక్క తెలంగాణ మీద పడ్డరని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీకి మళ్లీ పదవులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ఆదివారం (జూన్ 28) సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా హ్యామ్ రోడ్ల శంఖుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
అనంతరం ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని విమర్శించారు. పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే మేం త్యాగాలు చేశామని బీఆర్‌ఎస్ నేతలు చెబుతుంటారు. త్యాగాలు అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్స్ తేవడం, కలెక్షన్స్ చేయడమా అని ఎద్దేవా చేశారు. మీదే త్యాగమైతే.. కొండా లక్ష్మణ్‌బాపూజీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీకాంతచారిది ఏమనాలని ప్రశ్నించారు.
►ALSO READ | ఎన్ని నిధులైనా ఇస్తాం.. SLBC, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేస్తే.. మలిదశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునేలా తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష కూడా చేశారని అన్నారు. వందల మంది త్యాగాలు చేసి.. తెలంగాణ సాధిస్తే ఆ త్యాగాన్ని టీఆర్ఎస్ వాళ్లు తమ ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టే తెచ్చుకోని వాళ్లు త్యాగాలు గురించి మాట్లాడుతున్నారని హరీష్ రావును ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఎంతో మంది త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే పదవులు మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని ధ్వజమెత్తారు. పదేళ్లు పదవులు అనుభవించి రాష్ట్రాన్ని దోచుకున్నందుకు ప్రజలు కేసీఆర్ ఫ్యామిలీని బహిష్కరించారని అన్నారు.
