హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన నా జీవితకాల లక్ష్యం. దేశానికే తలమానికంగా మూసీ ప్రక్షాళన చేస్తం. ఒట్టేసి చెబుతున్నా.. మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తా. ఎవడు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదు. ఎవడు ఆత్మహత్య చేసుకున్నా, ఎవడు అడ్డం పడ్డా మూసీలో వేసి తొక్కి మరీ మూసీ పనులు పూర్తి చేస్తా. తెలంగాణలో 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటది. తెలంగాణను దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని అన్నారు.
ఆదివారం (జూన్ 28) సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా హ్యామ్ రోడ్ల శంఖుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలోపు ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే, డిండి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పారు.
ఎస్ఎల్బీసీ, డిండి, నక్కల గండి ప్రాజెక్టులు నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆంక్ష అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఎస్ఎల్బీసీని పడావ్ బెట్టిందని.. పదేళ్లలో కనీసం 10 కిలో మీటర్లు కూడా సొరంగం తవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని విమర్శించారు. పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేశారు. మాట్లాడితే మేం త్యాగాలు చేశామని బీఆర్‌ఎస్ నేతలు చెబుతుంటారు. త్యాగాలు అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్స్ తేవడం, కలెక్షన్స్ చేయడమా అని ఎద్దేవా చేశారు. మీదే త్యాగమైతే.. కొండా లక్ష్మణ్‌బాపూజీ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీకాంతచారిది ఏమనాలని ప్రశ్నించారు.
తెలంగాణ కోసం తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేస్తే.. మలిదశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారని గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా ప్రజలు గర్వంగా చెప్పుకునేలా తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష కూడా చేశారని అన్నారు. వందల మంది త్యాగాలు చేసి.. తెలంగాణ సాధిస్తే ఆ త్యాగాన్ని టీఆర్ఎస్ వాళ్లు తమ ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టే తెచ్చుకోని వాళ్లు త్యాగాలు గురించి మాట్లాడుతున్నారని హరీష్ రావును ఉద్దేశించి పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఎంతో మంది త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే పదవులు మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవించిందని ధ్వజమెత్తారు. పదేళ్లు పదవులు అనుభవించి రాష్ట్రాన్ని దోచుకున్నందుకు ప్రజలు కేసీఆర్ ఫ్యామిలీని బహిష్కరించారని అన్నారు.
