ఇండియాకు రజతమే..ఫైనల్లో ఓడిన రికర్వ్ టీమ్

ఇండియాకు రజతమే..ఫైనల్లో ఓడిన రికర్వ్ టీమ్
  •  ఫైనల్లో ఓడిన పురుషుల రికర్వ్‌‌ టీమ్‌‌
  •  వరల్డ్‌‌ ఆర్చరీ చాంపియన్‌‌షిప్‌‌

డెన్‌‌బాష్‌‌(నెదర్లాండ్స్‌‌):  గోల్డ్‌‌ ఆశలు రేపిన ఇండియా పురుషుల రికర్వ్‌‌ టీమ్‌‌ తుది మెట్టుపై బోల్తా పడింది. వరల్డ్‌‌ ఆర్చరీ చాంపియన్‌‌షిప్‌‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన రికర్వ్‌‌ ఫైనల్లో ఇండియా 2–6తో చైనా చేతిలో ఓడిపోయింది. దీంతో డ్రాగన్‌‌ జట్టు బంగారు పతకాన్ని దక్కించుకోగా ఇండియా సిల్వర్‌‌తో సరిపెట్టుకుంది. దీంతో ఈ చాంపియన్‌‌షిప్‌‌లో ఓ సిల్వర్‌‌, రెండు కాంస్య పతకాలు కలిపి మొత్తం మూడు మెడల్స్‌‌ సాధించినట్లు అయింది. మహిళల కాంపౌండ్‌‌ టీమ్‌‌, వ్యక్తిగత ఈవెంట్‌‌ల్లో ఇండియా రెండు కాంస్యాలు గెలిచింది.  ఫైనల్లో చైనా జట్టు పోటాపోటీగా తలపడడంతో తరుణ్‌‌దీప్‌‌ రాయ్‌‌, అతానుదాస్‌‌, ప్రవీణ్‌‌ జాదవ్‌‌తో కూడిన ఇండియా టీమ్‌‌  తొలి సెట్‌‌లో లీడ్‌‌ సాధించలేకపోయింది. ఇరు జట్లు తొలి సెట్‌‌లో 53 పాయింట్లు స్కోరు చేశాయి. రెండో సెట్‌‌లో అదరగొట్టిన చైనా కేవలం రెండు పాయింట్లు కోల్పోయి 58 స్కోరు చేసింది. మరోపక్క ఇండియా కేవలం 51 పాయింట్స్‌‌ మాత్రమే స్కోరు చేసి సెట్‌‌ కోల్పోయింది. మూడో సెట్‌‌ను 56–56తో ఇరుజట్లు డ్రా చేసుకోగా, ఆ సమయానికి చైనా 4–2తో ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి సెట్‌‌లోను జోరు కొనసాగించిన చైనా 57–52 స్కోరుతో సెట్‌‌తో పాటు మ్యాచ్‌‌ను గెలిచింది.  ఈ టోర్నీలో క్వార్టర్స్‌‌ చేరడం ద్వారా  పురుషుల టీమ్‌‌  ఒలింపిక్‌‌  బెర్త్‌‌ను కన్ఫామ్‌‌ చేసుకున్న సంగతి విదితమే.