వడదెబ్బకు..పిట్టల్లా రాలుతున్న జనాలు

వడదెబ్బకు..పిట్టల్లా రాలుతున్న జనాలు
  • పది రోజుల్లో 20 మందికి పైగా మృతి
  • పొట్టకూటి కోసం వెళ్లి కొందరు..అత్యవసర పనులకు వెళ్లి ఇంకొందరు మృత్యువాత
  • బయటకు రాని మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే  
  • మరో రెండ్రోజుల పాటు రెడ్‍ అలర్ట్​జారీ చేసిన వాతావరణ శాఖ

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతుండడంతో వడదెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. పది రోజుల్లోనే 20 మందికి పైగా చనిపోయారు. ఎండలు పెరుగుతున్నాయని, వడదెబ్బ తగలవచ్చని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేస్తున్నప్పటికీ పొట్టకూటి కోసం వెళ్లి కొందరు, అత్యవసర పనుల కోసం వెళ్లి ఇంకొందరు భానుడి ప్రతాపానికి బలవుతున్నారు. రెండు మూడు రోజుల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయనే హెచ్చరికతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు.  

ఏసీ చల్లదనం లేదు...కూలర్ల గాలి సరిపోవట్లే

భగభగమండే ఎండలతో ఇప్పటికే 22 జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో 18 జిల్లాల్లో అగ్గి పుట్టేంత ఎండ కొడుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉదయం 7 గంటల నుంచి ఎండ దంచి కొడుతుండగా.. రాత్రి 10 గంటల వరకు వడగాలి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం11 గంటల తర్వాత బయటకువెళ్తే ఎండతో మాడు పగులుతుంటే..వేడిగాలితో గూబ గుయ్యిమంటోంది. ఏసీలు ఉన్నోళ్లు18 డిగ్రీల టెంపరేచర్​పెట్టుకున్నా రూమ్స్ ​చల్లబడడం లేదు. కూలర్లలో బకెట్ల కొద్దీ నీళ్లు పోసి ముందే కూర్చున్నా చల్లగాలి రావడం లేదు. కనీసం ఆ కూలర్లు లేని పేదల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.  

ప్రచారానికి వెళ్లి.. పాణాలమీదికి తెచ్చుకుంటున్రు 

పార్లమెంట్‍ ఎన్నికలకు మరో వారమే గడువుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై ఎక్కువ ఫోకస్‍ పెట్టాయి. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులకుతోడు ప్రధాని మోదీ పర్యటనలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అయితే, ఈ సభలు, ప్రచారాలకు వెళ్లిన లీడర్లు, జనాలు అస్వస్థతకు గురై దవాఖానల పాలవుతున్నారు.దీంతో చాలామంది మీటింగులకు వెళ్లడం లేదు. 

ఉమ్మడి వరంగల్​లో ఏడుగురు..

గ్రేటర్‍ వరంగల్‍ హసన్‍పర్తి మండలం భీమారానికి చెందిన సంగాల నవీన్‍ కుమార్‍ (29) ఏప్రిల్‍ 29న, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరుకు చెందిన పత్తిపాక రమేశ్ (55) ఏప్రిల్30న, నడికూడ మండలం రాయపర్తికి చెందిన వ్యవసాయ కూలీ అల్లె గోవర్ధన్‍ (65) మే2న, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం బూటారానికి చెందిన రామగిరి ప్రేమలీల (66),  మంగపేటకు చెందిన చింత నాగులు (80) ఎండదెబ్బతో చనిపోయారు. అలాగే జనగామకు చెందిన డెకరేషన్‍ కార్మికుడు ఎండీ.మోహీనుద్దీన్‍ (52) మే 1న, ఇదే జిల్లా కేంద్రంలోని చమన్‍ ఏరియాకు చెందిన హోటల్‍ కార్మికురాలు బొమ్మగాని నిర్మల (62) ఏప్రిల్‍ 8న వడదెబ్బతో మరణించారు.

కరీంనగర్ జిల్లాలో ఆరుగురు.. 

వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన అంబాల అయిలమ్మ(60) ఏప్రిల్ 30న, చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన రైతు ఐతరవేని రాజేశం(47), తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్​కు చెందిన రొడ్డ నర్సయ్య(46), జమ్మికుంటకు చెందిన నిమ్మ సరోజన(50), రామడుగు మండలం గోపాల్ రావుపేటకు చెందిన దివ్యాంగ బాలుడు యశ్వంత్(5) మే 1న వడదెబ్బతో చనిపోయారు. శంకరపట్నం మండలం లింగాపూర్‍లో గజ్జెల సంజీవ్‍ (50) హమాలీ పనిచేస్తూ వడదెబ్బకు గురై చనిపోయాడు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నలుగురు..

భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి కాటేపల్లి శ్రీనివాస్(45), కొత్తగూడెంలోని గాజులరాజం బస్తీకి చెందిన రాజశేఖర్ (40), ముల్కలపల్లి మండలం చౌటుగూడెం గ్రామానికి చెందిన గుర్రం ప్రసాదరావు (53), పాల్వంచ మండలం జగన్నాథపురంలో భూ లక్ష్మి(67) వడదెబ్బతో కన్నుమూశారు.   అలాగే సిద్దిపేట, ఉమ్మడి నల్గొండలో, ఉమ్మడి ఆదిలాబాద్​లో  ముగ్గురు చొప్పున ప్రాణాలు విడిచారు. 

తల్లడిల్లుతున్న పక్షులు

ఎండలకు అన్ని వసతులున్న మనుషులే గాబరా పడుతుంటే..మూగజీవాలు గూడు కోసం, నీళ్ల కోసం తల్లడిల్లుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే పక్షులు నీళ్లు దొరక్క ప్రాణాలు విడుస్తున్నాయి. హైదరాబాద్​లోని జూపార్కుతో పాటు గ్రేటర్‍ వరంగల్‍ హంటర్ ​రోడ్​లో ఉన్న కాకతీయ జూపార్క్​లో జంతువులు, పక్షులకు ఎండనుంచి ఉపశమనం కలిగించేందుకు సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తున్నారు. నీటి పైపులు, స్ర్పింకర్లతో వాటిపై చల్లని నీరు స్ర్పే చేస్తూ కాపాడుతున్నారు.