V6 పేరుతో ఫేక్ వీడియోలు.. ! బీఆర్ఎస్ సోషల్ మీడియా చీప్ ట్రిక్స్

V6 పేరుతో ఫేక్ వీడియోలు.. ! బీఆర్ఎస్ సోషల్ మీడియా చీప్ ట్రిక్స్
  • జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ చేతులెత్తేసిందంటూ క్లిప్స్
  • రంగంలోకి డిప్యూటీ సీఎం భట్టి  దిగారని బ్రేకింగ్స్
  • పాత వీడియోను పోస్ట్ చేసి ఇవాళ సిద్ధార్థనగర్ లో అని ప్రచారం
  • కాసేపట్లో సీఎం రేవంత్ వస్తున్నారనీ స్క్రోలింగ్స్
  • దింపుడు కల్లం ఆశలో గులాబీ పార్టీ 

హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే గులాబీ సోషల్ మీడియా చీప్ ట్రిక్స్ కు దిగింది. కాంగ్రెస్ పార్టీని లక్ష్యం చేసుకొని V6 ప్రసారం చేయని ఫేక్ వీడియోలను తయారు చేసి ట్విట్టర్, పేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, రంగంలోకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగారని చెబుతూ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వదిలింది. కొద్ది సేపల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ కు వస్తున్నారని బ్రేకింగ్స్, టిక్కర్స్, స్క్రోలింగ్ లతో కూడిన వీడియోలతో ఓటరు మనసు మార్చేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా యత్నిస్తోంది. 

ప్రచారం మొదలైనప్పటి నుంచి వెలుగు ఫేక్ క్లిప్పింగులతో పోస్టింగ్ లు పెట్టిన ఈ టీం.. ఇప్పుడు ఏకంగా వీ6 వీడియో క్లిప్పులనే వదలడం గమనార్హం.  ఇవాళ ఉదయం హరీశ్ రెడ్డి ఆర్డీఎం అనే ట్విట్టర్ హ్యాండిట్  నుంచి ఈ వీడియో పోస్టు అయ్యింది. దానిని రవి తేజ అనే వ్యక్తి రీ ట్వీట్ చేశారు. హరీశ్ రెడ్డి తన హ్యాండిల్ డీపీగా ఆయన మాజీ మంత్రి కేటీఆర్ తో దిగిన ఫొటోను పెట్టుకున్నారు.  రామగుండంలో ఉంటున్నట్టు ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొన్నారు.  హరీశ్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 10 వీడియోలు, పోస్టులు పెట్టడం గమనార్హం.  

‘ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అరాచకాలు.. బోరబండలో బీఆర్ఎస్  పార్టీ ఓటర్ లిస్టు ఎత్తుకెళ్లిన కాంగ్రెస్ గుండాలు’ అంటూ బ్రేకింగ్స్ వేస్తున్నారు. ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన రవితేజ కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ కావడం గమనార్హం. తన హ్యాడింగ్ బయోలో తెలంగాణ యాక్టివిస్ట్ ను అని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సపోర్టర్ ను అని రాసుకున్నారు. ఈ వార్తలను వీ6 న్యూస్ అస్సలు ప్రసారమే చేయలేదు. 

కారు పార్టీ సోషల్ మీడియా వండి వార్చి.. వీ6 విశ్వసనీయతను తమకు ఓటుగా మార్చుకునేందుకు చేస్తున్న కుటిల యత్నం మాత్రమే. ఈ క్లిప్పింగ్స్ కు వీ6 న్యూస్ చానల్ ఎలాంటి సంబంధం లేదు. మరో వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుతోంది. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ చేజారి పోయిందనే టిక్కర్ తో ఈ వీడియోను నడుపుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో బీజీఎం తప్ప యాంకర్ వాయిస్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, ఫోన్ ఇన్ కానీ ఏమీ లేవు.. వీటిని బట్టి ఇదంతా ఫేక్ అని నిర్ధారించుకోవచ్చు..

కేటీఆర్ అన్న ఫాలోవర్ పేరుతో బాలాకుమార్ ఉగాది

బాలకుమార్ ఉగాది ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇవాళ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కు మద్దతుగా 9 పోస్టులు చేశారు. అందులో వీ6 ఫేక్ వీడియో క్లిప్ కూడా ఉండటం గమనార్హం. ఇది ట్విట్టర్ వెరిఫైడ్ హ్యాండిల్. బయోలో కేటీఆర్ అన్న ఫాలోవర్ అని ఉండటం గమనార్హం. హైదరాబాద్  నుంచే ఈ హ్యాండిల్ రన్ చేస్తున్నట్టు రాసుకొచ్చారు. ఈ వీడియోలు ఎవరు తయారు చేశారనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. 2010 నుంచి రన్ అవుతున్న ఈ అకౌంట్ ను 944 మంది ఫాలో అవుతున్నారు. 269 మందిని బాలాకుమారు ఉగాది ఫాలో అవుతున్నారు.