- కేసీఆర్ మార్క్‌నుంచి బయటకొచ్చే ప్రయత్నం
- ఆ పార్టీ అగ్రనేతలపై నేటికీ ధిక్కార స్వరమే
- ‘ఆడబిడ్డ రాజకీయం’ వ్యాఖ్యలపై జోరుగా సాగుతున్న చర్చ
- తాజాగా ‘జనం బాట’ ద్వారా ప్రజలతో మమేకం
- ఆప్యాయ పలకరింపులు.. ఆత్మీయ ఆలింగనాలు
- జనాన్ని ఆకట్టుకునేందుకు.. కట్టూ, బొట్టులోనూ మార్పు
- బీసీలు, ఉద్యమకారుల పక్షాన గళం
- ‘సామాజిక తెలంగాణ’ నినాదం.. కామన్ మ్యాన్ ఇష్యూస్‌తో జనంలోకి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్న కవిత.. ఇప్పుడు ‘కొత్త పార్టీ’ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. ఇటీవల ఆమె చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమంలో ‘ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎలా ఉంటదో చూపిస్తా’.. ‘రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొన్నది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ‘జనం బాట’ పేరుతో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న కవిత, తన కట్టూ, బొట్టూ, మాటతీరులో స్పష్టమైన మార్పును ప్రదర్శించడం ద్వారా తన రాజకీయ ఉద్దేశాన్ని పరోక్షంగా చాటి చెబుతున్నారు. ముఖ్యంగా, ‘సామాజిక తెలంగాణ’ నినాదాన్ని బలంగా వినిపిస్తూ, బీసీలు, ఉద్యమకారుల పక్షాన గళం విప్పడం ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రణాళికలో భాగమేనని చర్చ జరుగుతున్నది. ‘‘నాకు బీఆర్ఎస్‌లో ఎవరితోనూ పంచాయితీ లేదు. కుటుంబం నుంచే నన్ను బయటపడేశారు’’ అని చెప్పడం ద్వారా, తన తండ్రితో రాజకీయంగా వేరుపడిన విషయాన్ని నిర్మొహమాటంగా ప్రకటించారు. ‘‘తండ్రిగా కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి తప్పకుండా వెళ్తాను. కానీ రాజకీయంగా వెళ్లే పరిస్థితి లేదు’’ అని ఆమె తేల్చి చెప్పారు.
ఆ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం
కవిత తన ‘జనం బాట’ పర్యటనలో చేస్తున్న వ్యాఖ్యలు ఆమె కొత్త రాజకీయ వేదిక లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా, ‘‘తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు బహిరంగ క్షమాపణలు చెబుతున్నా’’ అంటూ ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ‘‘బీఆర్ఎస్ పాలనలో వారికి పూర్తి న్యాయం చేయలేకపోయాను’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆమె బహిరంగంగా అంగీకరించినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి కొనసాగింపుగా, ‘‘తెలంగాణలో కచ్చితంగా రాజకీయ శూన్యత ఉంది. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు’’ అంటూ ఆమె కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా..ఆమె బలంగా వినిపిస్తున్న ‘సామాజిక తెలంగాణ’ నినాదం.. కేవలం సెంటిమెంట్ కాకుండా పార్టీ స్థాపన కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మద్దతును కూడగట్టుకునే పథకంలో భాగమేనని తెలుస్తున్నది.
పాలిటిక్స్ పక్కా చేస్తానంటూ..
బీఆర్ఎస్‌తో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నప్పటికీ రాజకీయాల నుంచి తాను వెనక్కి తగ్గబోనని కవిత స్పష్టం చేశారు. ‘‘నాది వెనక్కి తగ్గే వ్యక్తిత్వం కాదు. పాలిటిక్స్ పక్కా చేస్తాను. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. కానీ దానికి ఇంకా సమయం ఉంది’’ అంటూ ఆమె సంకేతాలు పంపారు. గత పాలనపై కూడా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం’’ అంటూ బీఆర్ఎస్ అధినేతనే టార్గెట్‌చేయడం ద్వారా తన భవిష్యత్తుగమ్యం ఏమిటో చెప్పకనే చెప్పారు. ఈ ధిక్కార స్వరాన్ని బట్టి ఆమె కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతున్నదని పొలిటికల్అనలిస్టులు స్పష్టంచేస్తున్నారు ‘‘ప్రజలు కోరుకుంటే తప్పకుండా కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తా. పార్టీ పెడితే నాకు కాదు, ప్రజలకు మేలు జరగాలి” అని ఆమె చేసిన వ్యాఖ్యలతో, కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రజల నుంచి మద్దతు, సానుభూతిని కోరుకుంటున్నట్లు అర్థమవుతున్నది.
కేసీఆర్ పట్టించుకోలే..
తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఫొటోను కవిత ఇప్పటివరకూ ఎక్కడా వాడడం లేదు. ‘‘కేసీఆర్ కడుపున పుట్టడం నా అదృష్టం, కానీ మా దారులు వేరే అయినప్పుడు ఆయన ఫొటో వాడటం నైతికంగా కరెక్ట్ కాదు’’ అని ఆమె ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు.. తన తండ్రి నీడ నుంచి బయటపడి, సొంతంగా తన రాజకీయ అస్థిత్వాన్ని, వేదికను ఏర్పరచుకునే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె ప్రస్తావించిన ‘మర్రిచెట్టు నీడ కింద’ స్టోరీని గుర్తు చేస్తున్నారు. ‘జనం బాట’ ద్వారా కవిత ఇప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తుతున్నారు. ‘‘ఇప్పుడు నాకు స్వేచ్ఛ ఉంది. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తా” అని ఆమె ప్రకటించారు. వరంగల్ పర్యటనలో గుడిసెవాసుల సమస్యపై స్పందిస్తూ... ‘‘బీఆర్ఎస్ పట్టించుకోలే.. మీరన్నా చేయండి” అంటూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆమె వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. అంటే, ప్రస్తుతం ఉన్న ఏ పార్టీపైనా ఆమెకు పూర్తి విశ్వాసం లేదని, అందుకే తానే ప్రజల పక్షాన పోరాడటానికి సిద్ధమవుతున్నారనేది ఆమె సందేశంగా చెబుతున్నారు. వేషధారణ, భాష, ప్రసంగాల్లోనూ మార్పును ప్రదర్శిస్తూ, మరింత సామాన్యంగా ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న కవిత.. త్వరలో తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సెంటిమెంట్ పక్కనపెట్టి
తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతిక సెంటిమెంట్‌తో ‘తెలంగాణ జాగృతి’ని నడిపించిన కవిత, ఇప్పుడు ‘సామాజిక తెలంగాణ’ నినాదాన్ని వినిపిస్తున్నారు. బీసీలు, ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగాలనే అంశాలను ఆమె ప్రధాన ఎజెండాగా మార్చుకున్నారు. ‘‘సబ్బండ వర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నం. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికీ రాజ్యాధికారం రావాలి’’ అని ఆమె వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నానని ప్రకటించారు. ఈ సామాజిక న్యాయం నినాదం ద్వారా, తన పాత సెంటిమెంట్ రాజకీయాల నుంచి బయటపడి.. బహుజన వర్గాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం కవిత చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.
మారిన కట్టూ.. బొట్టూ
‘జనం బాట’లో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్న కవిత.. గతానికి భిన్నంగా తన కట్టూ.. బొట్టూ మార్చారు. నగలు, ఖరీదైన చీరలు, చేతి గడియారాలను పక్కనపెట్టారు. సాదాసీదా చీరకట్టు, సిగతో చూడగానే జనం మనిషిగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టూరా బాడీగార్డులు, బౌన్సర్లు లేకుండా ఒకరిద్దరు గన్‌మెన్లతో కాలనీలను చుట్టేస్తున్నారు. ముందస్తు ప్రచారాలు, కాన్వాయ్‍లు, పెద్ద లీడర్లతో హడావుడి చేయకుండా సింపుల్‌గా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆప్యాయ పలకరింపులు.. ఆత్మీయ ఆలింగనాలతో ఆమె పర్యటనలు సాగుతున్నాయి. జనం సమస్యలను ఓపికగా వింటూ.. వారిని ప్రేమతో ఓదార్చుతూ ముందుకు కదులుతున్నారు. ‘‘నా కుటుంబం, పిల్లలను వదిలి నేను కేవలం రాజకీయం చేయడానికి పర్యటనలు చేపట్టడం లేదు. జనం సమస్యలేంటో తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కరించడానికి జనం మనిషిగా వస్తున్నా..’’ అంటూ తన ఉద్దేశం ఏమిటో చెప్పకనే చెప్తున్నారు. ఇందుకు తగినట్లే కవిత తన పర్యటనలో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన సమస్యలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పదేండ్ల బీఆర్‍ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
