ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నేడే (ఫిబ్రవరి 11) మున్సిపల్ ఎన్నికలు

 ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నేడే (ఫిబ్రవరి 11) మున్సిపల్ ఎన్నికలు
  • రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో పోలింగ్‌‌‌‌ కు ఏర్పాట్లు పూర్తి
  • పోలింగ్ సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది
  • ఓటుకు వెయ్యి నుంచి రూ.5 వేలు, మద్యం, చికెన్ పంపిణీ 

కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. కరీంనగర్, రామగుండం  మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, జగిత్యాల, రాయికల్, కోరుట్ల, మెట్‌‌‌‌పల్లి, ధర్మపురి మున్సిపాలిటీల్లో బుధవారం జరగబోయే పోలింగ్  కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.  

పోలింగ్ సిబ్బంది, రూట్, జోనల్ అధికారులు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో కేంద్రాలకు తరలివెళ్లారు. కరీంనగర్ ఎస్సార్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు.  మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన చాలామంది అభ్యర్థులు మంగళవారం రాత్రి, బుధవారం ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలు, బ్రాండెడ్ మద్యం బాటిళ్లు పంపిణీ చేశారు.

పోలింగ్ రోజు ఓటర్ల ఇంట్లో తమ చికెన్, మటన్ వండుకునేలా ఫ్యామిలీకో కిలో చొప్పున ఆర్డర్ పెట్టారు. 7 గంటల నుంచి సా.5 గంటల వరకు పోలింగ్ బుధవారం ఉదయం7గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.  పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు పోలింగ్ బుత్ లో ఎన్నికల ఏజెంట్లు, మైక్రో అబ్జర్వర్ సమక్షంలో  ఖాళీ బ్యాలెట్ బాక్సులను చూపించి... సీల్ చేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారు. పోలింగ్ ప్రక్రియ ముగిశాక  ఎన్నికల  సిబ్బంది బారీ బందోబస్తు మద్య బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించి భద్రపరుస్తారు. 

466 స్థానాల్లో 2,360 మంది పోటీలో.. 

రామగుండం కార్పొరేషన్ లో 60 డివిజన్లకు గాను 1వ డివిజన్ లో  కాంగ్రెస్ అభ్యర్థి విజయ నామినేషన్ ఒక్కటే రావడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ డివిజన్ మినహా మిగతా ఉమ్మడి జిల్లాలో 466 స్థానాల్లో 2,360 మంది అభ్యర్థులు బుధవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కరీంనగర్ లో ఎన్నికల బందోబస్తులో 900 మంది, రామగుండంలో 500 మంది పోలీసులు భాగస్వాములు అవుతున్నారు.