‘రా..కదలిరా రా..ఏకమై కదలిరా’.. అంటూ తెలంగాణలో మారుమోగిన పాటలు బహుజన వర్గాల్లో భూకంపాన్ని సృష్టించాయి. తరతరాలుగా అణచివేతకు గురైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో మహనీయుల ఆశయాలను రగిలిస్తూ.. ‘తెలంగాణ గడ్డపై తమ వాటాను’ అడిగిన ఈ పాటలకు రూపం ఇచ్చిన ఆధునిక బహుజన నాయకుడు డాక్టర్ విశారదన్ మహరాజ్. ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే సమాజంలోని అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభించాలి.
రాజ్యాంగం వచ్చి 77 ఏళ్లు దాటినా జనాభాలో అధిక భాగాన్ని కలిగిన వెనుకబడిన తరగతులు(ఓబీసీ) ఇప్పటికీ రాజకీయంగా తగిన వాటా పొందలేకపోతున్నారు. రాజ్యాంగపరంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, ఓబీసీలకు మాత్రం వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సీట్లు కేటాయించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇది కేవలం తూతూ మంత్రంగా ఒక బిల్లు చేయడం, జీవో విడుదల చేయడం వరకే పరిమితమైంది. ఇది సైతం న్యాయస్థానంలో నిలబడలేకపోయింది.
ఎన్నికలకు ముందే బహుజన వాదం విజయం
‘ఎవరెంతో వారికి అంత వాటా’ అనే మాన్య కాన్షీరాం చారిత్రక నినాదం మరోసారి గుర్తుచేసింది. ఫలితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బహుజనుల గెలుపుకు, నేడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కేటాయింపుకు కారణమైంది. ఇది స్వరాజ్య నిర్మాణానికి వేయబడుతున్న పునాది రాళ్లు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గిరిజన తండాలను మినహాయిస్తే...జనరల్ స్థానాల్లో బీసీలు 50 శాతంపైగా గెలిచారు. మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలు 86.4 శాతం గెలవడం అతిపెద్ద సామాజిక విజయం. ఈ విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అన్ని రాజకీయ పార్టీలను కలవరపెట్టింది. ఇది పార్టీల దయ వల్ల కాదు, ప్రజల ఐక్యత, చైతన్యం, స్వీయ రాజకీయ అవగాహన వల్ల సాధించిన విజయం. ఈ ఫలితమే బహుజన శక్తి ఎంత ప్రభావవంతమో రాజకీయ పార్టీలకు అర్థమయ్యేలా చేసింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బహుజనుల ప్రాధాన్యతను గుర్తుచేసేలా చేశాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా తమ వైఖరిని మార్చుకున్నాయి.
స్థానిక సంస్థల్లో 86 శాతం గెలిచిన బహుజనులు
నేడు 42 శాతం బీసీ రిజర్వేషన్లు అధికారికంగా అమలు కాకపోయినప్పటికీ.. మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మెజారిటీ టికెట్లు కేటాయించారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో 86 శాతం బహుజనులు గెలిచారు. ఈ గెలుపుకు గల ప్రధాన కారణం.. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ప్రధాన కారణం. ఈ చైతన్యం మొన్న స్థానిక సంస్థల్లో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఇది ఏ ఒక్క పార్టీ ఔదార్యం కాదు, బహుజన వాదం తెచ్చిన రాజకీయ భూకంపమే. ఇప్పుడు బహుజన సమాజాన్ని విస్మరించి ఇక రాజకీయాలు నడవవని పార్టీలకు అర్థమైంది. తెలంగాణ రాష్ట్రంలో బహుజన వాదం ఇప్పుడు డిమాండ్ స్థాయిని దాటి, రాజకీయ అజెండాగా మారింది. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీల సంఘటిత ఉద్యమాల విజయం. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే అనుకూలంగా ఉండే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. టికెట్ల కేటాయింపుతోనే బహుజన వాదం సాధించిన ఈ ముందడుగు, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను కొత్త దిశగా మలిచే శక్తిగా మారనుంది. భవిష్యత్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు ఇది ఉప్పెనలాగ ఎగిసిపడే అవకాశం లేకపోలేదు.
బహుజన వాదం గెలిచినట్లే!
ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకే అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. బీసీలకు 50 శాతం కంటే ఎక్కువ టికెట్లు కేటాయించారు. పార్టీలన్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి దాదాపు 80 శాతంపైగా టికెట్స్ ఇవ్వడం జరిగింది. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేశాయి. కాంగ్రెస్ పార్టీ 53.71 శాతం సీట్లను బీసీలకు కేటాయించగా, విపక్ష బీఆర్ఎస్ కూడా దాదాపు 53.79 శాతం బీసీలను రంగంలోకి దించింది. ఇక బీజేపీ కాస్త తక్కువగా 49.89 శాతం సీట్లను బీసీలకు కేటాయించింది. ఇదిలా ఉండగా.. బీసీల తర్వాత ఎస్సీ, ఎస్టీలకు పాలక, విపక్ష పార్టీలు రెండూ సమానంగా కేటాయించారు. ఈ సీట్ల సమాన కేటాయింపును పరిశీలిస్తే అగ్రకుల పార్టీలన్నీ ఏకమై రాజకీయాలు చేస్తున్నారనీ అర్థమవుతుంది. ఆ పార్టీలు రాజకీయ నష్టాన్ని తప్పించుకోవాలనే భయంతోనే అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది ఎన్నికలకు ముందే బహుజన వాదం గెలిచినట్టే అని స్పష్టం చేస్తుంది.
- సంపతి రమేష్,
సోషల్ ఎనలిస్ట్
