Mohammed Shami: షమీని తప్పించడానికి కారణం ఏంటి..? సెలక్టర్లకు గంగూలీ సూటి ప్రశ్న

Mohammed Shami: షమీని తప్పించడానికి కారణం ఏంటి..? సెలక్టర్లకు గంగూలీ సూటి ప్రశ్న

సౌతాఫ్రికాతో  సొంతగడ్డపై జరిగే రెండు  టెస్టుల సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం (నవంబర్ 05) ప్రకటించిన జట్టులో  సీనియర్ పేసర్ మహ్మద్ షమీని సెలెక్టర్లు మరోసారి పక్కన పెట్టడం చర్చనీయాంశమైంది. చివరగా ఈ మార్చిలో చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో ఆడిన 35 ఏండ్ల షమీ ఇప్పుడు తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతూ ఇప్పటికే 93 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి చెమటోడ్చాడు. కానీ, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ మాత్రం ఈ వెటరన్ పేసర్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది.

భారత్ ఆ జట్టులో షమీకి చోటు దక్కకపోవడంపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "షమీ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 2-3 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో ఒంటి చేత్తో బెంగాల్‌ను గెలిపించాడు. ఈ విషయం సెలక్టర్లకు కూడా తెలుసు. వారు ఇదంతా గమనిస్తున్నారు. షమీ, సెలెక్టర్ల మధ్య కమ్యూనికేషన్ ఉందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. షమీ ఫిట్‌నెస్, నైపుణ్యం గురించి మన అందరికీ తెలుసు. షమీ ఇండియా తరపున టెస్ట్ మ్యాచ్‌లు, వన్డేలు, టీ20లు ఆడకపోవడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. ఎందుకంటే అతని ప్రతిభ, స్కిల్స్ అద్భుతమైనది". అని కోల్‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో గంగూలీ అన్నారు.

టీమిండియా సెలక్టర్ అజిత్ అగార్కర్ షమీ విషయంలో మాట తప్పాడు. షమీకి ఫామ్, ఫిట్ నెస్ ఉంటే ఖచ్చితంగా అతన్ని జట్టులో పరిగణిస్తామని అగార్కర్ క్లారిటీ ఇచ్చాడు. అయితే షమీ సూపర్ ఫామ్ లో ఉన్న సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు సెలక్ట్ చేయకుండా అతనికి బిగ్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం బెంగాల్‌‌‌‌‌‌‌‌ టీమ్ తరఫున రంజీల్లో బరిలోకి దిగిన షమీ ఆసీస్‌‌‌‌‌‌‌‌తో వన్డేలకు సెలెక్ట్ కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు.  తాను ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నానని.. ఒకవేళ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సమస్య ఉంటే రంజీ ట్రోఫీలో ఆడేవాడిని కాదన్నాడు. అలాగే, తన ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ గురించి సెలెక్టర్లు అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చే పని తనది కాదన్నాడు. 

రంజీల్లో వరుసగా మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన షమీ ప్రస్తుతం రైల్వేస్‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న పోరుకు దూరంగా ఉన్నాడు. ఈ నెల 16 నుంచి అసోంతో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో ఆడి డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే, 197 ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల అనుభవం ఉన్న ఈ వెటరన్ పేసర్‌‌‌‌‌‌‌‌ను తిరిగి ఇండియా జెర్సీలో చూడాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. లేదంటే, టీమిండియాలో మరో గొప్ప పేసర్ కథకు తెరపడినట్లే