జనగామ, వెలుగు: జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి కల్యాణ వేడుకలను సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం జరుగగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ జీడికల్ ఆలయాభివృద్ధికి రెండేళ్లలో రూ.కోటీ10 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. జనగామ నుంచి జీడికల్ వరకు రూ.8 కోట్ల 30 లక్షలతో వచ్చే శ్రీరామ నవమి వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఆలయాభివృద్ధి కోసం రూ.5 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అధికారులు, లీడర్లు, భక్తులు పాల్గొన్నారు.
