మహబూబాబాద్ లో మొక్కజొన్న రాసులకు నిప్పు.. లక్ష రూపాయల పంట నష్టం

మహబూబాబాద్ లో మొక్కజొన్న రాసులకు నిప్పు.. లక్ష రూపాయల పంట నష్టం

మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతుకు చెందిన మొక్కజొన్న పంటకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కుప్పలకు నిప్పంటించడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట అగ్గిపాలవడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. రైతుకు భారీ నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే.. 

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామానికి చెందిన రైతు గుండగాని రాజు తనకున్న ఒక ఎకరం పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఇటీవల పంటను కోసి కల్లంలో కుప్పగా పోశాడు. అయితే గురువారం (మార్చి 12) తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కుప్పలకు నిప్పంటించారు.

దీంతో పంట కుప్పలు పూర్తిగా మంటల్లో కాలిబూడిదయ్యాయి. సుమారు లక్ష రూపాయల విలువైన మొక్కజొన్న పంట నష్టపోయినట్లు రైతు రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇలా కాలిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడిందని తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని, అలాగే నష్టపోయిన తనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని రైతు రాజు కోరాడు.