మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్, ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను ఎంపీవో సుభాష్ చంద్రబోస్, స్థానిక సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, వంటగదిలో సామగ్రి, కూరగాయలు, పరిసరాలను పరిశీలించి, ప్రిన్సిపల్ శారదను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.
స్కూల్లో సమస్యలు ఏమైనా ఉంటే రాత పూర్వకంగా ఇస్తే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. స్కూల్లో సమస్యలపై ప్రిన్సిపల్ సర్పంచ్ విజయకు లేఖ అందించారు. అనంతరం ఎస్సీ బాయ్స్ హాస్టల్ ను సందర్శించిన వారు పరిసరాలు, స్టూడెంట్స్ రూములు పరిశీలించి, సిబ్బంది, స్టూడెంట్స్ తో విడివిడిగా మాట్లాడారు. విద్యార్థులకు మెను ప్రకారం ఆహారం అందించాలని వార్డెన్ శ్రీనివాస్ కు సూచించారు. కార్యక్రమంలో ఎంజేపీ స్కూల్ ఏటీపీలు నాగపూరి శ్రీనివాస్, సందీప్, పీఈటీ కార్తీక్, అస్రా బేగం, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
