కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతున్నదని కలెక్టర్ సత్య శారద తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ధాన్యం, పత్తి, మొక్కజొన్న, సోయా తదితర పంటల సేకరణ పై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ పై కలెక్టర్ వివరిస్తూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లా పరిధిలో 21 వేల ఎకరాల్లో 44 వేల మెట్రిక్ టన్నుల వరి పంట నష్టం జరిగిందని, 5 వేల 3 వందల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి కొనుగోలు ప్రారంభించామన్నారు.
ఇందుకోసం ఇప్పటి వరకు 203 కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం మంత్రులు కలెక్టర్కు వడ్లు, పత్తి కొనుగోళ్లపై మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ హైదరాబాద్ భారత సేవాశ్రమ సంఘ్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతంలోని తుఫాన్ మోంథా ప్రభావిత ప్రజలకు సహాయక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముంపు ప్రాంతాల్లో సంఘ్చేసే సేవలు అభినందనీయమన్నారు.
