ఏనుమాముల మార్కెట్లో వ్యాపారుల ఆందోళన.. రెండు గంటల పాటు నిలిచిపోయిన కాంటాలు

ఏనుమాముల మార్కెట్లో వ్యాపారుల ఆందోళన.. రెండు గంటల పాటు నిలిచిపోయిన కాంటాలు
  •     పోలీసులు వేధిస్తున్నారంటూ ఆఫీస్  ఎదుట బైఠాయింపు 

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్  ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో సోమవారం వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. మార్కెట్  ఆఫీస్​ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వ్యాపారస్తులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా గిద్ద ముత్తారం గ్రామానికి చెందిన బదావత్  రాజు నాయక్  గత నెల19న మార్కెట్​కు మిర్చి తీసుకొచ్చాడు. సూర్యతేజ అడ్తికి అమ్మాడు. కాగా, రాజు నాయక్  తన మిర్చి పంటను దొంగిలించి అమ్ముకున్నాడని ఓ రైతు భూపాలపల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈక్రమంలో ఆదివారం స్థానిక పోలీసులు మార్కెట్ కు వచ్చి సూర్య తేజ అడ్తికి చెందిన వ్యక్తిని ఆదుపులోకి తీసుకొని భూపాలపల్లి తరలించారు.

చాంబర్  ఆఫ్  కామర్స్  అధ్యక్షుడు రవీందర్  భూపాలపల్లి పోలీసులు, మార్కెట్  అధికారులతో మాట్లాడినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీనిని అవమానంగా భావించిన చాంబర్  ఆఫ్  కామర్స్  నాయకులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు.

ఈ విషయాన్ని మార్కెట్  ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లారు. 10 గంటల తరువాత ఆందోళన విరమించారు. శని, ఆదివారాలు మార్కెట్​కు సెలవు కావడంతో సోమవారం మార్కెట్​కు పెద్ద ఎత్తున సరుకు వచ్చింది. వ్యాపారులు ఆందోళనకు దిగి కాంటాలు ప్రారంభించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.కొంత ఆలస్యంగా కాంటాలు స్టార్ట్​ కావడంతో    రైతులు   ఊపిరి పీల్చుకున్నారు.