గాంధీలో షర్మిలకు వైద్య పరీక్షలు పూర్తి.. నాంపల్లి కోర్టుకు తరలింపు

గాంధీలో షర్మిలకు వైద్య పరీక్షలు పూర్తి.. నాంపల్లి కోర్టుకు తరలింపు

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం షర్మిలను  నాంపల్లి కోర్టుకు తరలించారు.  పోలీసులపై దాడి కేసులో  వైఎస్  షర్మిలను ఏప్రిల్ 24న  అరెస్ట్ చేశారు. ఎస్ఐ రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో షర్మిలపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ 332, 353, 509, 427 సెక్షన్ల కింద షర్మిలపై కేసులు నమోదు చేశారు. 

నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి: షర్మిల

ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసేందుకు పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తున్న షర్మిలను ఏప్రిల్ 24న ఉదయం అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే ఆమె వారిని నెట్టేశారు. దీంతో లోటస్‌ పాండ్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన షర్మిలను పోలీసులు అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తరలించారు.  పోలీసులపై చేయి చేసుకున్నందుకు షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  మహిళా కారిస్టేబుల్ తో  పాటుగా ఎస్ ఐ రవీందర్ పై షర్మిల చేయిచేసుకున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు 4  సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. పర్సనల్ పనులకు తనని బయటకు వెళ్లనివ్వరా అని షర్మిల ప్రశ్నించారు. షర్మిలతో తన గన్ మెన్ ను కూడా వెళ్లకుండా పోలీసులు ఆపేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. పోలీసులు కేసీఆర్  కోసమే పనిచేస్తున్నారని షర్మిల ఆరోపించారు.  

దాడి చేయలేదు : వైఎస్ విజయమ్మ

వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆమె తల్లి విజయమ్మ ప్రశ్నించారు. తాను పోలీసులపై దాడి చేశానన్న వార్తలను ఖండించిన ఆమె.. పోలీసులపై ఎలాంటి దాడి చేయలేదన్నారు. తనను అరెస్టు చేస్తుంటే వారిని అడ్డుకున్నానని వివరించారు. వైఎస్ షర్మిల అరెస్టుపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. షర్మిల సిట్ కార్యాలయానికి దగ్గరకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని, అసలు షర్మిల సిట్ ఆఫీస్ కు వెళ్తే సమస్యేంటీ అని ప్రశ్నించారు. తెలంగాణ సర్కార్ ను ప్రశ్నించినందుకే వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారని విజయమ్మ ఆరోపించారు. ప్రశ్నించే గొంతును  ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసుల దగ్గర్నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు.