మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయండి: రఘునందన్ రావు

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయండి: రఘునందన్ రావు
  •     సీఈవోకు బీజేపీ అభ్యర్థి రఘునందన్​రావు ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు :  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్‌క్వాలిఫై చేయాలని అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కో ఓటరుకు రూ.500 డబ్బులు పంచారంటూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై ఇప్పటికే చాలాసార్లు పోలీసులకు కంప్లైంట్ చేశానని.. ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు.
 

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఫామ్‌హౌస్ నుంచి డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. బూత్‌ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్‌లలో డబ్బు పెట్టి గ్రామాల్లో పంపిణీ చేశారని చెప్పారు. 20కి పైగా కార్లలో డబ్బు తరలిస్తున్నారని తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు ఒక్క కారునే పట్టుకొని హడావిడి చేశారని అన్నారు. రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందని మెదక్ పోలీసులు భావిస్తున్నట్టు ఉన్నారని విమర్శించారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు చెప్పారు.