తెలంగాణ తెచ్చుకున్నది భూములను అమ్ముకోవడానికా?..కేసీఆర్ బాటలోనే రేవంత్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి

తెలంగాణ తెచ్చుకున్నది భూములను అమ్ముకోవడానికా?..కేసీఆర్ బాటలోనే రేవంత్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
  • ఫిరాయింపులను ప్రోత్సహించడం బీఆర్ఎస్, కాంగ్రెస్​కు​ అలవాటే
  • కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  అవగాహన రాజకీయాలు నడుస్తున్నాయని, ఈ రెండు పార్టీల లక్ష్యం హైదరాబాద్, దాని చుట్టు పక్కల భూములను ఆక్రమించడమేనని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఒకరు బట్టలు విప్పుకోవడం, మరొకరు విప్పించడం వంటి డ్రామాలు ఇందులో భాగమేనన్నారు. శనివారం మాదాపూర్ లోని దస్ పల్లా హోటల్ లో జరిగిన రోజ్ గార్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘నువ్వు కొట్టినట్టు చేస్తే.. నేను ఏడ్చినట్టు చేస్తాను అన్నట్టుగా ఇరు పార్టీల తీరు ఉంది. అసలు తెలంగాణ తెచ్చుకున్నది అప్పులు చేయడానికా.. ఉన్న భూములను అమ్ముకోవడానికా.. భూములు ఆక్రమించుకోవడానికా?’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో కేటీఆర్ అనేక దుకాణాలు ఓపెన్ చేస్తే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి వసూళ్ల దందాలు మొదలుపెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భూముల దోపిడీ, అధికార దుర్వినియోగం విషయంలో ఏమాత్రం తేడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న సర్కార్​ జాగాలను కాపాడాల్సిన ప్రభుత్వాలే, వాటిని వేలం వేస్తూ వ్యాపారాలు చేస్తున్నాయన్నారు.

సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, ఎస్బీఐ, హౌసింగ్ బోర్డు కాలనీలు, పార్కుల స్థలాలను కూడా వదలకుండా అమ్ముతున్నారని మండిపడ్డారు. కృత్రిమంగా భూముల ధరలను పెంచి, రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కై సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. భావితరాల అవసరాల కోసం భూములను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేవలం కాంక్రీట్ జంగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

దానంపై  హైకోర్టు తీర్పు రాజ్యాంగ విజయం

పార్టీ ఫిరాయింపుల విషయంలో దానం నాగేందర్ అనర్హత తీర్పును కిషన్ రెడ్డి స్వాగతించారు. ‘ఇది రాజ్యాంగ విజయం. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి చేరిన దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయడం సమంజసం. రాహుల్ గాంధీ ఢిల్లీలో సంవిధాన్ బచావో అని తిరుగుతూ, ఇక్కడ చట్టవిరుద్ధంగా ఫిరాయించిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు? దీనికి ఆయన సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ వైఎస్సార్​ఇదే విధంగా ఫిరాయింపులను ప్రోత్సహించారని, ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కూడా అదే పద్ధతిలో చట్టాలను ఉల్లంఘించి కొనసాగారని గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని కనీసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించకుండానే బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే అడుగుజాడల్లో నడుస్తోందన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం రెండు పార్టీలకు అలవాటుగా మారిందని కిషన్ రెడ్డి విమర్శించారు.