సీఎం పదవికి బొమ్మై రాజీనామా ..కాంగ్రెస్ వ్యూహాన్ని ఛేదించలేకపోయాం

సీఎం పదవికి బొమ్మై రాజీనామా ..కాంగ్రెస్ వ్యూహాన్ని ఛేదించలేకపోయాం

కర్ణాటక ఎన్నికల్లో  బీజేపీ ఓటమిపాలవడంతో సీఎం బసవరాజ్ బొమ్మై తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తవార్ చంద్ గెహ్లోట్ కు తన రాజీనామా లేఖను అందజేశారు. యడ్యూరప్పను సీఎం పదవి నుంచి తప్పించిన అనంతరం బీజేపీ అధిష్టానం బసవరాజు బొమ్మైకి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది. బసవరాజు బొమ్మై మొత్తం 19 నెలల 17 రోజుల పాటు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 65 సీట్లలో విజయం సాధించింది. జేడీఎస్ కు 19 సీట్లు రాగా.. కల్యాణ రాజ్య ప్రగతి పక్షం పార్టీ, సర్వోదయ కర్ణాటక పక్షం పార్టీ ఒక్కో సీటులో గెలుపొందాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు.రాబోయే రోజుల్లో పార్టీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ వ్యూహం ఫలించిందని...కాంగ్రెస్ వ్యూహాన్ని ఛేదించలేకపోయామన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తామని  తెలిపారు.ఈ ఓటమిపై విశ్లేషించుకుంటామని బొమ్మై అన్నారు. అన్ని లోటుపాట్లను అధిగమించి లోక్‌సభ న్నికల్లో గెలవడానికి అవసరమైన అన్ని సన్నాహాలు చేస్తామన్నారు. తనను ఎన్నుకున్నందుకు షిగ్గావ్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.