- ఫోన్లో సిమ్ వేయగానే అకౌంట్ ఖాళీ
- హైదరాబాద్‌కు చెందిన బాధితుడి ఫిర్యాదుతో నలుగురు అరెస్ట్
ఈ-సిమ్ ను ఫిజికల్ సిమ్గా మార్చు కోవాలని చెప్పి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.77.55 లక్షలు కొట్టేశారు. ఈ కేసులో పోలీసులు బెంగాల్, రాజస్తాన్‌కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలి, వెలుగు: ఈ–సిమ్ ను ఫిజికల్సిమ్గామార్చుకోవాలని చెప్పి, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి నుంచి సైబర్ కేటుగాళ్లు రూ. 77.55 లక్షలు కొట్టేశారు. ఈ కేసులో బెంగాల్, రాజస్థాన్ కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహర్ శనివారం వెల్లడించారు.
బెంగాల్‌కు చెందిన సలీం మండల్ అనే నిందితుడు తొలుత హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి విజయ్‌కుమార్‌కు ఫోన్ చేసి, తాను ‘సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు విభాగం’ అధికారిని అని పరిచయం చేసుకున్నాడు. టెలికాం శాఖ వెరిఫికేషన్ ఉందనే నెపంతో విజయ్‌కుమార్ వాడుతున్న ఈ-–సిమ్ ను సాధారణ ఫిజికల్ సిమ్ కార్డుగా మార్చుకోవాలని కోరాడు. అందుకు విజయ్‌కుమార్ ఒప్పుకోగా, సిమ్ మార్చుకోవడానికి బ్యాంకు తరపున తామే ఒక ప్రత్యేక మొబైల్ ఫోన్ పంపిస్తామని, అందులోనే సిమ్ కార్డ్ వేసుకోవాలని నిందితుడు సూచించాడు. చెప్పినట్లుగానే మోటరోలా స్టిక్కర్లు, బ్యాంకు లేబుల్స్ వేసి ఉన్న ఒక మొబైల్ ఫోన్‌ను కొరియర్ ద్వారా విజయ్‌కుమార్‌కు పంపించాడు.
అయితే, ఆ ఫోన్లో ముందే ఒక మాల్వేర్ను నిందితులు ఇన్స్టాల్ చేసి ఉంచారు. విజయ్‌కుమార్ కొరియర్ ఓపెన్ చేసి, ఆ ఫోన్లో తన సిమ్ కార్డు వేయగానే లోపల ఉన్న మాల్వేర్ యాక్టివేట్ అయ్యింది. ఆయన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఓటీపీలు, ఇతర బ్యాంకింగ్ మెసేజీలు అన్నీ బాధితుడికి తెలియకుండానే నేరుగా నిందితుడి ఫోన్‌కు డైవర్ట్ అయిపోయాయి. ఓటీపీలు తమ చేతికి చిక్కడంతో నిందితులు విజయ్‌కుమార్ అకౌంట్ల నుంచి రూ.77.75 లక్షలు కొల్లగొట్టారు. తన ఖాతా నుంచి డబ్బు మాయం కావడంతో బాధితుడు విజయ్‌కుమార్.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు.. డబ్బు బదిలీ అయిన ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేస్తూ వెస్ట్ బెంగాల్‌కు వెళ్లారు. దాదాపు నెల రోజుల పాటు కోల్‌కతాలోనే ఉండి నిఘా పెట్టి, ప్రధాన నిందితుడు సలీం మండల్‌తో పాటు అబ్దుల్ అలీం, సయ్యద్ హమీమ్ రెజా, బన్సిధర్ ను అరెస్టు చేశారు. వారిని ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్ తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు.
