చిన్న బిజినెస్​లకు ఫేస్​బుక్​ అప్పులిస్తది

చిన్న బిజినెస్​లకు ఫేస్​బుక్​ అప్పులిస్తది
  • ఇండిఫైతో జత రూ. 5 లక్షల నుంచి 
  • రూ.50 లక్షల దాకా అప్పు

న్యూఢిల్లీ: దేశంలోని చిన్న వ్యాపారాలకు అప్పులు ఇవ్వనున్నట్లు ఫేస్​బుక్​ ప్రకటించింది. రూ.5 లక్షల నుంచి రూ. 50 లక్షల దాకా అప్పులను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇలా అప్పులిచ్చేందుకు ఇండిఫై సహా పలు ఫైనాన్స్​ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. తన ప్లాట్​ఫామ్​పై అడ్వర్టైజ్​మెంట్లు ఇచ్చే చిన్న వ్యాపారాలకు ఈ అప్పులు ఇస్తామని ఫేస్​బుక్​ తెలిపింది. ఫేస్​బుక్​ ఈ ప్రోగ్రామ్​ను మొదటగా ఇండియాలోనే అమలు చేస్తోంది. దేశంలోని 200 సిటీలలో రిజిస్ట్రేషన్​ ఉన్న బిజినెస్​లు అన్నింటికీ ఈ ప్రోగ్రామ్​ వర్తిస్తుందని ఫేస్​బుక్​ పేర్కొంది. చిన్న వ్యాపారులకు అవసరమైన బిజినెస్​లోన్లు మరింత తొందరగా వచ్చేలా చూడాలనేదే తమ లక్ష్యమని ఫేస్​బుక్​ ఇండియా వైస్​ ప్రెసిడెంట్, ఎండీ​ అజిత్ మోహన్​ వెల్లడించారు. ఈ ప్రోగ్రామ్​లో ఫేస్​బుక్​కు ఎలాంటి రెవెన్యూ షేర్​ ఉండదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ఫేస్​బుక్​ప్లాట్​ఫామ్​పైనే ఈ డబ్బు ఖర్చు చేయాలనే రూలేమీ లేదని కూడా పేర్కొన్నారు. ​ అప్రూవల్​, డిస్​బర్స్​మెంట్​, రికవరీ వంటి అన్నింటినీ ఇండిఫై కంపెనీనే చూసుకుంటుందన్నారు. 200 మిలియన్​ల బిజినెస్​లు గ్లోబల్​గా  ఫేస్​బుక్​ యాప్స్ (ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, వాట్సప్​)​ను ఉపయోగించుకుంటున్నాయని, ఇండియాలోనూ చాలా బిజినెస్​లు వాడుకుంటున్నాయని అజిత్​ మోహన్​ వివరించారు. ఫేస్​బుక్​ ప్లాట్​ఫామ్​పై అడ్వర్టయిజ్​ చేసే బిజినెస్​లు ఇండిఫై నుంచి 17–20 శాతం వడ్డీ రేటుతో అప్పులు తీసుకోవచ్చు. వీటికి ప్రాసెసింగ్ ఫీజు ఉండదని పేర్కొన్నారు. డాక్యుమెంటేషన్​ పూర్తయిన అయిదు రోజులలోపే అప్పు మొత్తాన్ని ఇండిఫై డిస్​బర్స్​ చేస్తుందని చెప్పారు. మహిళలకైతే 0.2 శాతం వడ్డీ తగ్గింపు​ ఉంటుందన్నారు. 2020లో నిర్వహించిన తమ సర్వేలో క్యాష్​ ఫ్లో మెయిన్​ ఛాలెంజని చాలా బిజినెస్లు చెప్పినట్లు ఫేస్​బుక్​ వెల్లడించింది. ఎక్కువ క్రెడిట్​ హిస్టరీ లేని చిన్న వ్యాపారాలకు అప్పులు దొరకడం అంత ఈజీ కాకపోవడంతో,  ఈ ప్రోగ్రామ్​ను తెస్తున్నట్లు ఫేస్​బుక్​ ప్రకటించింది. ​ఈ దిశలో ఫేస్​బుక్​తో కలిసి పనిచేయనున్నట్లు లాంచ్​ సందర్భంగా ఫిక్కి ప్రెసిడెంట్​ ఉదయ్​ శంకర్​ కూడా చెప్పారు.100 మిలియన్​ డాలర్ల గ్లోబల్​ గ్రాంట్​లో భాగంగా ఇండియా కోసం 4 మిలియన్​ డాలర్లు వెచ్చించామని, 3 వేల చిన్న వ్యాపారాలు  ఈ బెనిఫిట్​ పొందాయని మోహన్​ వివరించారు.