అది రద్దయి నాలుగేళ్లయింది..ఏదంటే..

అది రద్దయి నాలుగేళ్లయింది..ఏదంటే..

నాలుగేళ్ల క్రితం  వరకు ఆ ప్రాంతం ఓ కురుక్షేత్రం.  ఎప్పుడూ అల్లకల్లోలం.. తుపాకీ శబ్దాలు.. బాంబుల మోతలతో అట్టుడికిపోయిన జమ్మూకాశ్మీర్ ప్రాంతం నాలుగేళ్ల నుంచి ప్రశాంతంగా ఉంది.  జమ్మూకాశ్మీర్ లో 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దయింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందని  ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) తెలిపారు.   అప్పటినుంచి జమ్మూ కశ్మీర్ లో భద్రతా దళాల కాల్పుల్లో ఏ ఒక్క పౌరుడు గాయపడలేదని, అలాగే ఎన్‭కౌంటర్ జరిగిన ప్రదేశాల్లో రాళ్లు రువ్వే సంఘటనలు కనపించలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవంలో మాత్రం పరిస్థితి వేరేలా కనిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు.  అప్పుడప్పుడు కాల్పులు జరుగుతూనే ఉన్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు.  

జమ్మూ కశ్మీర్‭కు కల్పించిన ప్రత్యేక హోదా అయిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5 న  పార్లమెంట్ రద్దు చేసింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ ఆర్టికల్ రద్దు అనంతరం కశ్మీర్ రెండు భాగాలుగా విడిపోయింది. లధాఖ్ ప్రాంతం పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా మారిపోగా.. మిగిలిన జమ్మూ కశ్మీర్‭ను అదే పేరుతో కొనసాగిస్తూ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. పరిస్థితులు సద్దుమణిగాక రాష్ట్ర హోదా ఇస్తామని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.

ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దును కొంతమంది కశ్మీర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.  370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో  దాఖలు చేసిన పిటిషన్లను నాలుగేళ్ల తరువాత విచారించేందుకు అంగీకారం తెలిపింది,  ఆగస్టు 2 వ తేదీన ప్రారంభమైన విచారణ  సంబంధిత వ్యాజ్యాలపై రోజువారీ విచారణ చేపట్టనున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఐపీఎస్​ అధికారి షా ఫైజల్​, సామాజిక కార్యకర్త షెహ్లా రషీద్​లు వేసిన ఈ పిటిషన్ విచారణ సాగుతోంది.