గాలి జనార్థన్ రెడ్డికి సీబీఐ షాక్..100కు పైగా ఆస్తులు జప్తు

గాలి జనార్థన్ రెడ్డికి సీబీఐ షాక్..100కు పైగా ఆస్తులు జప్తు

మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డికి సీబీఐ స్పెషల్ కోర్టు షాకిచ్చింది. గాలి జనార్దనరెడ్డి  భార్య అరుణ పేరుతో ఉన్న 124 ఆస్తుల్లో 100కు పైగా జప్తు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.  జనార్దనరెడ్డిపై ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణ పూర్తయ్యే వరకూఈ  ఆస్తులను జప్తు చేయాలని సూచించింది. 

గాలి జనార్థన్ రెడ్డి దంపతులకు సంబంధించి మొత్తం 124 ఆస్తులను జప్తు చేయాలని గతంలో సీబీఐ అధికారులు స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు జూన్ 14వ తేదీ బుధవారం విచారించింది. అఈ సందర్భంగా మొత్తం 100 పైగా ఆస్తులను అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్ట సవరణ కింద జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. 

గాలి జనార్థన్ రెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతులెందుకు ఇవ్వడం లేదని గత ప్రభుత్వాన్ని సీబీఐ స్పెషల్ కోర్టు గతంలో  ప్రశ్నించింది. అయితే  దీనిపై ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం ప్రమాణ పత్రం దాఖలు చేయడంతో  తాజాగా కోర్టు ఈ  ఆదేశాలు జారీ చేసింది. గాలి జనార్థన్ రెడ్డి  ఇళ్లు, ఇంటి స్థలాలు, ఫ్లాట్లు తదితరాలను ఆయన కర్ణాటక, తెలంగాణలో కొనుగోలు చేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. అక్రమ గనుల తవ్వకాలతోనే వీటిని కొన్నట్లు అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.