ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర

ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర

బంగారం ధర పెరుగుదల ఒక్కరోజుకే పరిమితమై.. ఎంత వేగంగా పెరిగిందే అంతే స్థాయిలో తగ్గిపోయింది. నిన్న ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన వెంటనే ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిన బంగారం ధర 24 గంటలు తిరగకముందే పడిపోయింది.  రూపాయి విలువ బలపడడం, అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడం తదితర కారణాలతో బంగారం ధర వెంటనే దిగివచ్చింది. బులియన్‌ ర్యాలీ గురించి చెప్పాలంటే ‘‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్’’ లా మారింది. 
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన వెంటనే క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. అలాగే రూపాయి బలహీనపడింది. దీంతో బంగారం ధర బలపడి ఒక్కసారిగా రాకెట్ వేగంతో పెరిగింది. గంటల వ్యవధిలో ఏకంగా 1500 రూపాయలకు పైగా పెరిగింది. వెండి ధర కూడా అంతే స్థాయిలో పెరిగింది.  నిన్న గురువారం ఒక్కసారిగా భారీగా పెరిగిన బంగారం ధరలు మరుసటి రోజే అంటే ఇవాళ శుక్రవారం ఢమాల్‌ అన్నాయి. స్పాట్‌తో పాటు ఫ్యూచర్స్‌లో బంగారం ధర గణీయంగా తగ్గిపోయింది. నిన్న బంగారంతో పాటు డాలర్‌ కూడా పెరగడంతో మన మార్కెట్‌లో భారీ లాభాలు వచ్చాయి. 
అయితే ఇవాళ దేశీయంగా స్టాక్ మార్కెట్లో లాభాలతో రాణించడం, రూపాయి విలువ బలపడడం వంటి కారణాలతో బంగారంతో పాటు డాలర్ కూడా తగ్గడంతో నష్టాలు కూడా భారీగానే వచ్చాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఏప్రిల్‌ డెలివరీ బంగారం ధర రూ.1,332 తగ్గి రూ. 50,211 వద్ద ట్రేడవుతోంది. అలాగే కిలో వెండి మార్చి నెల కాంట్రాక్ట్ ధర కూడా రూ.2,008 తగ్గి రూ.65,121 వద్ద ట్రేడవుతోంది. తాజా సమాచారం ప్రకారం అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1913 డాలర్లుగా ఉంది. 

 

ఇవి కూడా చదవండి

గృహ హింస కేసులో దోషిగా లియాండర్‌ పేస్‌ 

ప్రాణాలతో నన్ను చూడడం ఇదే చివరిసారేమో

మేడారం మూడో రోజు హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే..

సినిమా బాగుంటే చూస్తారు..లేకపోతే మరో అజ్ఞాతవాసి