- మీకు అనుతమతులు తెచ్చుకునే పద్ధతి తెలిస్తే.. మాకు ఆపే పద్ధతి తెలుసని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అధికారం, మందబలం ఉందని మాట్లాడడం చాలా తప్పని పేర్కొన్నారు. మిగులు జలాలు అనేవే ఉంటే.. నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు బనకచర్ల ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును (పీఎఫ్ఆర్) ఎందుకు తిప్పి పంపాయని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్), గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ), కేంద్ర పర్యావరణ శాఖలు పీఎఫ్ఆర్ను తిరస్కరించాయన్నారు.
తెలంగాణ నీటి హక్కులను బుల్డోజ్ చేసేలా చంద్రబాబు బనకచర్లపై కుట్రలు పన్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. బనకచర్లను కట్టి తీరుతామన్న లోకేశ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో పవర్ ఉందన్న అండతో బనకచర్లను కట్టితీరుతామని లోకేశ్ అంటే.. దాన్ని తెలంగాణ ఆపి తీరుతుందని తేల్చి చెప్పారు. ఎలా ఆపాలో తమకు కూడా తెలుసన్నారు. మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. మిగులు జలాలనేవే ఉంటే ఏపీకి ఎన్ని.. తెలంగాణకు ఎన్ని నీళ్లు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు ఉమ్మడి ఏపీలోనూ
నీటిపై అప్పటి పాలకులు కుట్రలు చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
పోతిరెడ్డిపాడుకు బొక్క పెట్టి నీళ్లు తీసుకుపోయారని, ఆనాడు కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉండడం వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు కూడా ఏపీ పాలకులు అలాగే బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, బుల్డోజ్ చేస్తుంటూ తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు
ఉండి బనకచర్ల మీద కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని నిలదీశారు. ఎంపీలు ఉన్నది తెలంగాణ హక్కులు కాలరాయడానికా? కాపాడడానికా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

