విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ అమ్మవారికి ఒక భక్తుడు భారీ కానుకను సమర్పించారు. నిజామాబాద్‌కు చెందిన ఓ భక్తుడు అమ్మవారిపై తనకున్న భక్తిని చాటుకుంటూ సుమారు 107 గ్రాముల బంగారు హారాన్ని విరాళంగా ఇచ్చారు.
నిజామాబాద్ జిల్లా ద్వారకానగర్‌కు చెందిన తోడుపునూరి శ్రీనివాస్ అనే భక్తుడు మంగళవారం (ఏప్రిల్ 21న) కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిని సందర్శించుని.. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, 107.500 గ్రాముల బరువున్న బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
ఈ కాసుల హారంలో అందమైన పచ్చలు, కెంపులను పొదిగారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, ఈ బంగారు హారం విలువ సుమారు రూ. 16.30 లక్షల నుండి రూ. 16.70 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆ భక్తుడికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసారు.

