V6 News

అన్నిరంగాల్లో సర్కారు విఫలం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

అన్నిరంగాల్లో సర్కారు విఫలం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
  • మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్  కేసీఆర్ రాకతోనే రాష్ట్రానికి దశదిశ

జగిత్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్  ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్  నాయకత్వం ద్వారానే తెలంగాణకు మళ్లీ మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు. జగిత్యాల బీఆర్‌‌‌‌‌‌ఎస్  ఆఫీస్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగిత్యాలలో జరిగిన కేసీఆర్  బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసిందన్నారు. 

ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ అభిమానం చాటుకున్నారని చెప్పారు. కేసీఆర్  హయాంలో రైతుబంధు వంటి పథకాలతో రైతులకు నేరుగా లాభం చేకూరిందని, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుభరోసా అమలులో విఫలమైందన్నారు. పంట బీమా, భూమి లేని రైతులకు ప్రోత్సాహకాలు వంటి హామీలు నిలబెట్టుకోలేకపోయిందన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో బంగారం ఇస్తామని చెప్పి అమలు చేయడం లేదని, కేసీఆర్  కిట్  పేరును మార్చి అయినా కొనసాగించాలని సూచించారు. 

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్  నిధులు ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు కోల్పోయారని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌‌‌‌పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రిపేర్లు చేయడానికి తక్కువ ఖర్చే అవుతుందని నివేదికలు చెబుతున్నా జాప్యం చేస్తున్నారన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్  హామీపై కూడా ప్రశ్నించారు. రాజకీయంగా తాను ఎప్పుడూ పదవుల కోసం ప్రయత్నించలేదని, ఆత్మగౌరవం కోసం మాత్రమే నిర్ణయాలు తీసుకున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ, సింగరేణి, హోమ్ గార్డ్స్, ఉద్యోగులు అభద్రతలో ఉన్నారని తెలిపారు. ప్రజలు పాలనలో మార్పు కోరుకుంటున్నారని, రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలనే భావన బలపడుతోందని చెప్పారు.