ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో వెండి ధర కిలోకు రూ.2లక్షల 65వేల వద్ద ఒక రకమైన స్థబ్దతను ప్రదర్శిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలు.. ఇప్పుడు నిలకడగా ఉండటం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సైలెంట్ పీరియడ్ భారీ మార్పుకు సంకేతం అని అంటున్నారు కొందరు నిపుణులు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై భారీగా పందెం కాయడానికి వెనుకాడటం రేట్ల నిలకడకు ప్రధాన కారణం అని వారు చెబుతున్నారు.
యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోతే వెండి ధరలు మళ్లీ రాకెట్ వేగంతో దూసుకుపోయే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా యుద్ధ సమయంలో సేఫ్ హెవెన్‌గా భావించి లోహాలపై ప్రజలు పెట్టుబడి పెడతారు. కానీ ఇప్పుడు పారిశ్రామిక అవసరాల దృష్ట్యా వెండికి డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, కొన్ని బ్యాటరీల తయారీలో వెండి వాడకం పెరగడం వల్ల ధరలు తగ్గే అవకాశం తక్కువని వారు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కేజీ వెండి ధర రూ.3 లక్షల మార్కును తాకొచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఇరాన్-అమెరికా శాంతి చర్చలు సఫలమైతే అంతర్జాతీయ వాణిజ్యం పుంజుకుంటుంది. దీనివల్ల డాలర్ ఇండెక్స్‌లో వచ్చే మార్పులు వెండి ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్ వేచి చూసే ధోరణిలో ఉంది. ఒకవేళ ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం పూర్తిగా ముగిసి, ప్రశాంతత నెలకొంటే పారిశ్రామిక ఉత్పత్తి పెరిగి వెండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అప్పుడు సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండి ధరలు మరింత పుంజుకుంటాయని బులియన్ మార్కెట్ విశ్లేషిస్తోంది. కాబట్టి ప్రస్తుత రేటు వద్ద వెండి కొనడం భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని మార్కెట్ టాక్.

