హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును సమర్ధించిన హైకోర్టు.. కమిటీ నివేదికను మాత్రం నిలిపివేసింది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తయారు చేసిందని కోర్టు పేర్కొంది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్.కె. జోషిలకు భారీ ఊరట దక్కింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్, మాజీ ఐఏఎస్ ఎస్.కె. జోషి గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. అనంతరం గత మార్చి 12న తీర్పును రిజర్వ్ చేసింది. వాస్తవానికి ఈ తీర్పును ఈనెల 8నే వెలువరించాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ధర్మాసనం దాన్ని ఏప్రిల్ 22కు (బుధవారం) వాయిదా వేసింది. ఈ మేరకు బుధవారం హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. పీసీ ఘోష్ కమిషన్‌ను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలీ.
కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు ను సవాల్ చేసిన పిటిషన్లు పై హైకోర్టు తీర్పు
కేసీఆర్ , హరీష్ , స్మిత సబర్వాల్, SK జోషి కు ఊరట
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లు పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు కోసం GO నెంబర్6 ను తీసుకొచ్చిన ప్రభుత్వం
Go నెంబర్ 6 ను సస్పెండ్ చేయాలని పిటిషనర్లు కోరిన , అంగీకరించని న్యాయస్థానం
సెక్షన్ 8B , సెక్షన్ 8C కింద నోటీసులు ఇవ్వకుండా, తమ వాదనలు పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్లు వాదనలకు ఏకీభవించిన న్యాయస్థానం

